
తాగునీటి కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
గట్టు: మండలంలోని ఆలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు తాగు నీటి సమస్యపై రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. గట్టు–గద్వాల రోడ్డుపై ఆలూరు బస్టాండ్ దగ్గర విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని తాగు నీటి సమస్యను తీర్చాలని ఆందోళన నిర్వహించారు. నీటి సరఫరా సక్రమంగా లేదని, మధ్యాహ్న భోజన సమయంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని అనేక పర్యాయాలు ఉపాధ్యాయులు, గ్రామ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ చెన్నయ్య, ఇన్‌చార్జ్ ఎంఈఓ వెంకటేశ్వర్లు మిషన్ భగీరథ అధికారులతో కలిసి ఆలూరు ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో తాగునీటి సమస్యపై ఆరా తీశారు. అయితే కేవలం స్కావెంజర్ నిర్లక్ష్యంగా కారణంగానే నీటి సమస్య నెలకొందని, పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ ద్వారా, బోరు ద్వారా నీటి సరఫరా అవుతున్నట్లు అధికారులు తెలిపారు.