
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
గద్వాల న్యూటౌన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, బహుజన రాజ్య సమితి, ప్రజా సంఘాల నాయకులు కోరారు. గురువారం స్థానిక టీఎన్‌జీఓ భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్‌బాబు, వెంకటస్వామి, ఆంజనేయులు, ప్రభాకర్, పల్లయ్య, వాల్మీకీలు మాట్లాడారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుకు కాంగ్రేస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పారు. రిజర్వేషన్ గ్యారెంటీగా అమలు చేయడానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు. 50శాతం ఉన్న బీసీల సమస్యపై గవర్నర్ తగిన చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే బీసీజనాభా లెక్కలను ప్రభుత్వం చేపట్టి, వారి శాతాన్ని తేల్చిందన్నారు. పార్లమెంట్‌లో చట్ట సవరణ చేసి రిజర్వేషన్‌ల శాతాన్ని ఆయా వర్గాల జనాభా మేరకు పెంచడానికి బీజేపీ చొరవ తీసుకొని, చిత్తశుద్ది నిరూపించుకోవాలని సూచించారు. సమావేశంలో నాయకులు హన్మిరెడ్డి, కిరణ్‌కుమార్, సుభాన్, దామోదర్, గంజిపేట రాజు తదితరులు పాల్గొన్నారు.