
చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి
అలంపూర్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని తహసీల్దార్ మంజుల అన్నారు. అలంపూర్ పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో జిల్లా స్థాయి ఖోఖో పోటీలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ మంజుల, ఎంపీడీఓ పద్మావతి, ఎంఈఓ అశోక్ కుమార్ హాజరయ్యారు. అండర్–14 విభాగంగలో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లాలోని 13 మండలాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్య అతిథులు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో శారీరక మానసిక వికాసం వృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. అనంతరం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన జట్లు పోటీపడ్డాయి. ఖోఖో ఫైనల్స్‌లో బాలికల విభాగంలో ఎర్రవల్లి–వడ్డేపల్లి మండలాల జట్లు తలపడగా ఎర్రవల్లి జట్టు విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో ఇటిక్యాల–అయిజ జట్లు పోటీ పడగా.. అయిజ జట్టు విజేతగా నిలవగా ఇటిక్యాల జట్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో యువజన క్రీడా జిల్లా అధికారి కృష్ణయ్య, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఖోఖో జిల్లా కన్వీనర్ భరత్ కుమార్, ప్రధానోపాధ్యాయులు మాధవి, అమరేందర్ రెడ్డి, బాలజీ కృష్ణకుమార్ పీఈటీలు పార్వతమ్మ, అరుణతార, శైలజ, శ్రీనివాసులు, దేవేందర్ నాయుడు, రాజు, నాగరాజు, తిరుపతి, నరస్మింహ రాజు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.