
ప్రతి ఉపాధి కూలీకి పని కల్పించాలి
మానవపాడు: ప్రతి ఉపాధి కూలీకి తప్పక పని కల్పించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు సూచించారు. గురువారం మండలంలోని కలుకుంట్ల, చెన్నిపాడు, మానవపాడు గ్రామాలలో గ్రామ పంచాయతీ ఉపాధికూలీల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సక్రమంగా రికార్డులను నిర్వహించాలని, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రసహాయకులు, కొలతలు తీసి ఎంబీలు సరిగా చేయని సాంకేతిక సహాయకులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని ఇంకుడుగుంతలను, నర్సరీలలలోని మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవ, పంచాయతీ కార్యదర్శి సంధ్యరాణి సిబ్బంది పాల్గొన్నారు.
అలంపూర్ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు
అలంపూర్: అలంపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని, ఈమేరకు ప్రొసీడింగ్ వచ్చినట్లు కమిషనర్ శంకర్ తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గురువారం విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీలోని 10 వార్డులలో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు, ఆర్చీగేట్, రోడ్డు విస్తరణ, మరమ్మతుల కోసం ఈ నిధులు వచ్చినట్లు తెలిపారు.అక్బర్ పేటలో కాలనీలో సమస్య పరిష్కారానికి రూ.4.50 లక్షలతో కలెక్టర్‌కు నివేదికలు పంపినట్లు తెలిపారు.
పందులను శివార్లకు తరలించాలి
ఇదిలాఉండగా, కార్యాలయంలో పందుల పెంపకందార్లతో కమిషనర్ సమావేశమయ్యారు. పందులను ఊరికి బయట ఉంచుకోవాలని సూచించినట్లు తెలిపారు. పందులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పందుల పోషణకు స్థలాలు కేటాయించారని కానీ అక్కడ విద్యుత్ సదుపాయం లేదని పందుల పెంపకందార్లు కమిషనర్‌కు తెలిపారు. విద్యుత్ సరఫరా తీసుకోవడానికి సరైన పత్రాలు లేవని తెలిపారు. స్థలానికి సంబందించిన పత్రాలు ఇచ్చి విద్యుత్ సదుపాయం కల్పిస్తే ఊరి బయట వాటి పోషణకు ఏర్పాట్లు చేసుకుంటామని తెలిపారు.
వేరుశనగ క్వింటా రూ.4,950
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు గురువారం 207 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.4950, కనిష్టం రూ.2670, సరాసరి రూ.4386 ధరలు లభించాయి. అలాగే, 113 క్వింటాళ్ళ ఆముదాలు రాగా గరిష్టం రూ. 5940 కనిష్టం రూ. 5710, సరాసరి రూ. 5932 ధరలు పలికాయి.
మొక్కజొన్న క్వింటా రూ.2,075
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం వివిధ ప్రాంతాల నుంచి 2,812 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.2,075, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆముదాలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,709, కనిష్టంగా రూ.5,629గా ధరలు లభించాయి. హంస ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,789గా ఒకే ధర పలికింది.
19న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: కల్వకుర్తి పట్టణంలో ఈనెల 19న ఉదయం 9 గంటలకు ఉమ్మడి జిల్లా ఖోఖో సీనియర్ పురుషుల, మహిళా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి జీఏ విలియం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లిలో వచ్చేనెల 6 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఒరిజినల్ ఆధార్‌కార్డుతో హాజరుకావాలని, మిగతా వివరాల కోసం సీనియర్ క్రీడాకారుడు రాజు (9985022847) నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
యోగాసన క్రీడాజట్ల ఎంపికలు
ఉమ్మడి జిల్లా యోగాసన సబ్ జూనియర్, జూనియర్ విభాగాల బాల, బాలికల జట్ల ఎంపికలను ఈనెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రాములు, ఆర్.బాల్‌రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 8–10, 10–12, 12–14, 14–16, 16–18 ఏళ్లలోపు క్రీడాకారుల ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, ఒరిజనల్ ఆధార్‌కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9440292044 నంబర్‌కు సంప్రదించాలని వారు సూచించారు.