
పారదర్శకంగా పత్తి కొనుగోలు: కలెక్టర్
గద్వాల: జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాఫీగా నిర్వహించేలా అధికారులు ముందుస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి కొనుగోలుకు సంబంధించి రైతుకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా కొనుగోలు కేంద్రాలలో తూకం, చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. గద్వాలలో రెండు, అలంపూర్‌లో ఒకటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరు నుంచి పత్తికొనుగోలు ప్రక్రియ ప్రారంభించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పత్తిలో తేమ శాతం 8వరకు ఉండేలా ఇప్పటి నుంచే రైతులకు అవగాహన కల్పించాలని, కిసాన్ యాప్ ద్వారానే రైతులు స్లాట్‌బుకింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, వ్యవసాయ శాఖ ఏడీ సంగీతలక్ష్మీ, సీసీపై ఏడీ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రత్యేక దృష్టి పురోగతి సాధించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యలయంలోని ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అన్ని మండలాల అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల లక్ష్యాన్ని కేటాయించిన నిర్మాణాల లక్ష్యన్ని వీలైనంత త్వరగా చేరుకోవాలని అన్ని గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారుల వివరాలను త్వరగతిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్ నందు అన్‌లైన్ నమోదు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లను ఎంత త్వరగా పూర్తి చేస్తే బిల్లులు త్వరగా అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, శ్రీనివాస్‌రావు, డిపిఓ నాగేంద్రం తదితరులు ఉన్నారు.
ఓటర్ జాబితాను సరిపోల్చండి
2002–2025 ఓటరు జాబితాను సరిపోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్పరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి 2002–2025 ఓటరు జాబితాలో సరిపోల్చే కార్యక్రమంపై మాట్లాడారు. ఓటరు జాబితాల మధ్య విశ్లేషణ, మ్యాచింగ్, బ్యాచింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా పరిశీలనను వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు కేటగిరీలుగా విభజించి నిర్దేశాలు ఇచ్చారు. ఈ నెల 24వ తేదీన నివేదికలు సమర్పించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా నివేదికలు రూపొందించాలన్నారు.