
రాజకీయ కలకలం
అబ్రహం దారెటు?
అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన స్పందించలేదు. పార్టీ మార్పును ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. అలంపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి సీటు దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్‌లోనూ వర్గపోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చర్చలు జరిగినట్టు చెబుతున్నా పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు.
● కారు పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
● ఈ నెల 9న బీజేపీలో చేరే అవకాశం?
● ప్రచారంలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: బీఆర్‌ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా తీవ్రంగా చర్చ సాగుతోంది. రెండు దశాబ్దాలుగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల పార్టీ వీడుతుండటంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ కేడర్‌లో నెలకొంది. ఈనెల 9న ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.
ప్రాధాన్యత లేదని..
బీఆర్‌ఎస్ పార్టీలో 2007లో చేరిన గువ్వల బాలరాజు మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. 2009లో మొదటిసారిగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్‌ఎస్, టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వ విప్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీటు ఆశించినా భంగపాటు ఎదురైంది. ఈ సీటును ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని, పార్టీ అధినేత కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదని అనుచరులతో చెబుతున్నారు. భవిష్యత్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటారని, వారి కన్నా ముందే తానే బీజేపీలో చేరుతున్నట్లు ముఖ్య అనుచరులతో స్పష్టం చేశారు.
అయోమయంలో పార్టీశ్రేణులు..
గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం నేపథ్యంలో గులాబీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అకస్మాత్తుగా గువ్వల రాజీనామా, పార్టీ మార్పు ప్రకటనతో పార్టీలో ఏం జరుగుతోందన్న అయోమయంలో పార్టీ శ్రేణులు ఉన్నారు. గువ్వల రాజీనామా క్రమంలో మిగతా నేతలు కూడా అదే బాటలో పడుతున్నారన్న ప్రచారం, వదంతుల నేపథ్యంలో పలువురు నేతలు స్పందించి పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండిస్తున్నారు.
బీఆర్‌ఎస్ పార్టీలో ప్రకంపనలు
ఎప్పటికీ పార్టీ
లైన్‌లోనే ఉంటా:
జైపాల్‌యాదవ్
చివరి శ్వాస వరకు బీఆర్‌ఎస్‌తోనే: మర్రి
తాను చివరి శ్వాస వరకు బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గ దర్శకాలతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు.
తాను ఎప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీ లైన్‌లోనే ఉంటానని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. గువ్వల నిర్ణయంతో తమకు సంబంధం లేదని చెప్పారు. తాను నిత్యం పార్టీ కార్యకర్తల నడుమ ఉంటున్నానని, బీఆర్‌ఎస్ పార్టీ కోసమే నిరంతరం పని చేస్తానని స్పష్టం చేశారు.