
‘నౌరోజ్ కళా బృందానికి’ రాష్ట్రస్థాయి గుర్తింపు
అయిజ: లలిత కళా సమాఖ్య సేవా సామాజిక సంస్కృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ 31వ సువర్ణ కంకరణ అవార్డు సంబరాల్లో అయిజ మండలం నౌరోజ్ క్యాంప్ కళా బృందం ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి బహుమతి గెలుపొందింది. ఈ గెలుపులో అయిజ మండలం దేవబండ గ్రామానికి చెందిన మాస్టర్ శివకుమార్ ప్రత్యేక పాత్ర పోషించారు. వీరి కుటుంబం మూడు తరాల నుంచి కోలాటం నేర్పిస్తూ.. ఇంటిపేరే కోలంట్లగా మారింది. ఇదిలాఉండగా, హైదరాబాద్‌లోని కోలాట ప్రదర్శనలో మొత్తం 9 రాష్ట్రాల బృందాలు పాల్గొనగా.. రాష్ట్రం తరపు నుంచి మాస్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో అయిజ మండలానికి చెందిన నౌరోజ్ క్యాంప్ కళా బృందం పాల్గొనింది. ఈమేరకు ఉత్తమ ప్రతిభ కనబర్చగా ఈ బృందానికి ప్రథమ, ఏపీ బృందానికి ద్వితీయ, కేరళ బృందానికి తృతీయ బహుమతి లభించింది. ఈమేరకు నిర్వాహకులు మాస్టర్‌కు బంగారు కంకణం, మెడల్, బృందం సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి, సినీ నటులు జార్జారావు, శివాజీ రాజు పలువురు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం పలువురు ప్రముఖులు కోలాటం శివకుమార్‌ను, నౌరోజ్ క్యాంప్ కళా బృందాన్ని అభినందించారు.