
మెనూ ప్రకారం భోజనం అందించాలి
గద్వాల: ప్రభుత్వం సూచించిన మేరకు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం గద్వాల పట్టణంలోని చింతలపేటలో ఎస్సీ సంక్షేమ వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వసతిగృహంలోని స్టోర్‌రూం, వంటగది, కాంపౌండ్‌లోని పరిసర ప్రాంతాల్లో కలియతిరిగారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలు అడిగారు. దూరప్రాంతాల నుంచి విద్య కోసం ఇంత దూరం వచ్చారని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా క్రమశిక్షణతో ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. స్వయంగా విద్యార్థుల హాజరును పరిశీలించి విద్యార్థుల హాజరు వందశాతం లేని యెడల సక్రమంగా హాజరు కాని వారిపేర్లు తొలగించి వారి స్థానంలో కొత్తవారిని చేర్చుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నుషితా, వార్డెన్లు శ్రీను, ఽమధు, రామకృష్ణ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. పనుల నాణ్యతపై ఏమాత్రం రాజీపడకుండా ప్రతిదశలో పనులు వేగంగా చేయాలన్నారు. ప్రతిఇంటిని అనుమతించిన 600 చదరపు అడుగుల లోపే నిర్మించేలా లబ్ధిదారులకు తెలియజేయాలని, అవసమరైన ఇసుక, మట్టిని అందజేయాలని, ఏఏ పనులు పూర్తయితే వాటి వివరాలు దశలవారిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. లబ్ధిదారులకు విధిగా డబ్బులు జమచేయాలన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ దశరథ్, హౌసింగ్‌పీడీ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.