
వరుణుడిపైనే ఆశలు..!
జిల్లాలో జూన్, జూలైలో సాధారణం కంటే కనిష్ట వర్షపాతం నమోదు
●
గద్వాల: వానాకాలానికి ముందుగానే మే నెలలో ముందస్తుగా వర్షాలు కురవడంతో రైతులు ఎంతో సంతోషించారు. దుక్కులు దున్ని పంటలు సాగుచేసుకునేందుకు సిద్ధం చేసుకున్నారు. ఖరీఫ్‌లో మెట్టపంటలైన పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, పొగాకు, ఆముదాలు, కందులు, కూరగాయలు వంటి పంటలు 1,73,211 ఎకరాల్లో సాగుచేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, జూన్, జూలైలో సాధారణ వర్షపాతం కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో సాగుచేసిన పంటలు ఎండుముఖం పడుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతోపాటు వానాకాలంలో సమృద్ధిగా కురవాల్సిన వర్షాలు.. కురవకపోవడంతో భూగర్భజలాలపై కూడా ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఆశలతో రైతులు పంటలు సాగు చేయగా.. వరుణుడు కురవాల్సిన సమయంలో మాత్రం ముఖం చాటేశాడు. ప్రధానంగా జూన్, జూలై మాసాల్లో సాధారణం కంటే కూడా కనిష్ట వర్షపాతం నమోదైంది. వాస్తవానికి జూన్‌లో 84.4మిల్లీ మీటర్ల మేర వర్షం నమోదు కావాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా 72.4మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కేవలం 5 రోజులు మాత్రమే వర్షం కురవగా మిగిలిన 25రోజుల పాటు వర్షమే కురవలేదు. అంటే సాధారణం కంటే 13.5 శాతం వర్షపాతం కనిష్టంగా కురిసింది. అదేవిధంగా జూలైలో సాధారణ వర్షం 112.1 మి.మీటర్లు కురవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా కనిష్టంగా 96.9 మి.మీటర్ల వర్షం కురిసింది. కేవలం 9 రోజులు మాత్రమే వర్షం కురిసింది. 22రోజుల పాటు వర్షం జాడేలేదు. అంటే 13.6శాతం వర్షపాతం కనిష్టంగా కురిసింది.
కనిష్ట వర్షపాతం నమోదు
పత్తి పంట ఎండుతుంది..
గతేడాది పత్తిపంట దిగుబడి బాగా వచ్చింది. ఈసారి ముందస్తు వర్షాలు కురవడంతో 11 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాను. కానీ, జూన్, జూలై రెండు నెలల్లో సరైన వర్షాలు కురవనేలేదు. బాగా కాపుకాసి చెట్టు పెరిగే దశలో నీరు అందకుండా పోయింది. మొక్క పెరుగుదల అనుకున్నంతగా పెరగలేదు. ఇప్పటికే ఎకరాకు రూ.70వేల చొప్పున మొత్తం రూ.7లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. మరో వారం రోజుల్లో సరైన వర్షాలు కురవకపోతే పంట మొత్తం ఎండిపోతుంది.
– నాయుడు, బోరెల్లి, మానవపాడు
దిగుబడిపై ప్రభావం
జూన్, జూలై నెలలో సాధారణ వర్షపాతం కంటే కూడా తక్కువ వర్షాలు కురిశాయి. దీంతో వర్షాధార పంటలకు ఇబ్బందులు తలెత్తాయి. మరో వారం, పది రోజుల్లో ఇలాగే వర్షాలు కురవకపోతే పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
– సక్రియానాయక్, డీఏఓ
ఇప్పటికే 1.70 లక్షల ఎకరాల్లో మెట్టపంటలు సాగు
ఎండుముఖం పడుతున్న పత్తి, మిరప, వేరుశనగ పంటలు
రూ.వేల పెట్టుబడులు పెట్టామంటూ ఆందోళనలో రైతులు