
అభివృద్ధిని ఇంటింటా వివరించండి
రాజోళి: బీజేపి హయాంలోనే గ్రామాల్లో నూతన శకం మొదలైందని.. బీజేపీ హయాంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధిని ఇంటింటా వివరించాలని నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. గృహ మహా సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఆదివారం మండల కేంద్రం రాజోళిలో మండల అధ్యక్షుడు శశి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ..బీజేపి ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రధానిగా గ్రామాలకు అందించిన సేవలను వివరించారు. నేడు గ్రామాల్లో కనిపిస్తున్న అభివృద్ధి ప్రధాని మోదీ ద్వారానే సాధ్యమైందని అన్నారు. సీసీ రోడ్లు, ఉచిత బియ్యం, ముద్ర రుణాలు, విశ్వకర్మ రుణాలను అందించి సాధారణ, మద్య తరగతి ప్రజలకు మేలు చేసిందన్నారు. దేశ భద్రతలో భాగంగా ఆర్టికల్ 370 రద్దు, మైనార్టీ మహిళల కోసం త్రిపుల్ తలాక్ రద్దు, ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రమూకలను తోక ముడుచుకునేలా చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలను ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అబద్దపు హామీలను, రిజర్వేషన్ల పేరుతో ఓట్లు కాజేసేందుకు మళ్లీ ప్రజల్లోకి వస్తుందని, వారిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై, బీజేపీ పాలనపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, రానున్న అన్ని ఎన్నికల్లో బీజేపి విజయఢంకా మోగిస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...ఈ నెల 4,5 తేదీలల్లో మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు 100 ఇళ్లకు తిరిగి బీజేపి ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో రాజగోపాల్,సంజీవ రెడ్డి,రాజశేఖర్,నాగేశ్వర్ రెడ్డి, నాగరాజు, గోవిందు రాజులు, గోపాల కృష్ణ, భగత్ రెడ్డి బీమన్న తదిదరులు పాల్గొన్నారు.