
కేంద్రియ విద్యాలయ ఏర్పాటుకు స్థల పరిశీలన
మల్దకల్ : మండల కేంద్రమైన మల్దకల్, కుర్తిరావుల చెర్వు గ్రామ పరిసరాల్లోని ప్రభుత్వ భూమిని శుక్రవారం కేంద్రియ విద్యాలయ అధికారులు కృష్ణవేణి, హరిప్రసాద్, డీఈఓ అబ్దుల్ ఘని పరిశీలించారు. మల్దకల్ తహసీల్దార్ ఝాన్సీరాణి, ఎంఈఓ సురేష్‌ల ఆధ్వర్యంలో మల్దకల్ టూరిజం శాఖ నిర్మించిన అతిథిగృహాన్ని తాత్కాలిక కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నిర్మాణాలు చేపట్టే వరకు ప్రస్తుతం వాటిలో పాఠశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రియ విద్యాలయ ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి శాంతిరాజు, సూపరిండెంట్ వీరశేఖర్, సర్వేయర్ హరికృష్ణ, ఆర్‌ఐ మద్దిలేటి తదితరులు ఉన్నారు.