ముచ్చోనిపల్లికి ముప్పు..! | - | Sakshi
Sakshi News home page

ముచ్చోనిపల్లికి ముప్పు..!

Jul 28 2025 8:09 AM | Updated on Jul 28 2025 8:09 AM

ముచ్చ

ముచ్చోనిపల్లికి ముప్పు..!

రిజర్వాయర్‌కు అలుగు కాల్వ లేక ఇబ్బందులు

గట్టు: రూ.38.25 కోట్లు వెచ్చించి.. 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ముచ్చోనిపల్లి రిజర్వాయర్‌ను ఏళ్లుగా సగం నీటితో నింపి సరిపెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధానంగా ప్రతి రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండిన తర్వాత ఎక్కువైన నీరు అలుగు కాల్వ ద్వారా బయటకు వెళ్లాల్సి ఉండగా.. ఈ రిజర్వాయర్‌కు అసలు అలుగు కాల్వనే నిర్మించకపోవవడం గమనార్హం. ఒకవేళ వరదొస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న రేకెత్తుతోంది. ఈ ముప్పును ఇప్పటికై నా అధికారులు గమనించాలని రైతులు కోరుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో 109 ప్యాకేజీలో భాగంగా ముచ్చోనిపల్లె గ్రామం వద్ద రూ.38.25 కోట్లతో 1.5 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి కాంట్రాక్టర్‌ 2007లో ఒప్పందం చేసుకోగా, 2015లో రిజర్వాయర్‌ పనులు పూర్తి చేశారు. పదేళ్ల క్రితమే రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయినప్పటికీ అలుగు కాలువ నిర్మాణం మాత్రం అసంపూర్తిగా వదిలేశారు. రిజర్వాయర్‌ను నిర్మించిన ఇంజినీరింగ్‌ అధికారులు కేవలం అలుగు కాల్వను నిర్మించలేక పోతున్నారు. అలుగు (సర్‌ప్లస్‌ చానల్‌) కాల్వవ ఉంటేనే రిజర్వాయర్‌ నిండిన తర్వాత ఎక్కువైన నీరు అలుగు ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అలుగు కాల్వ నీరు పారేందుకు సుమారుగా 90 ఎకరాల మేరకు భూములు అవసరమున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ మాత్రం అధికారులు ఏళ్లు గడుస్తున్నా అలుగు కాలువను మాత్రం ఏర్పాటు చేయలేక పోతున్నారు. తద్వారా ముచ్చోనిపల్లె రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేక పోతున్నారు. మొక్కుబడిగా ఏటా కొద్ది పాటి నిటిని మాత్రమే నింపి చేతులు దులుపుకొంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అలుగు ద్వారా పారే నీరు బయటకు వెళ్లడానికి వీలుగా కాలువ నిర్మాణం చేపట్టలేదు. 1.5 టీఎంసీల సామర్థ్యం కల్గిన ముచ్చోనిపల్లె రిజర్వాయర్‌ను సాగు నీటి శాఖ అధికారులు ఇప్పటి దాకా కేవలం 60 శాతం మేరకు మాత్రమే నీటిని నింపుతూ వచ్చారు. భారీ వర్షాలకు రిజర్వాయర్‌పై భాగంలోని గట్టు, మాచర్ల, బల్గెర, యల్లందొడ్డి, చింతలకుంట గ్రామాల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున తరలివచ్చి ముచ్చోనిపల్లె రిజర్వాయర్‌లోకి చేరితే పరిస్థితి ఎంటనే ప్రశ్న రైతుల్లో నెలకొంది.

భూములు అమ్మి ఎలా బతకాలి

ఈ భూములను విడిచి ఎలా బతకాలి. సేద్యం తప్పా మరో పని చేతకాదు. కాల్వ కోసం సేకరించే భూములకు మార్కెట్‌ రేట్‌ ప్రకారం ఎకరాకు రూ.12లక్షలు చెల్లించాలి. బయట మార్కెట్‌లో రేటు ఇంకా ఎక్కువగానే ఉంది. ప్రభుత్వం చెల్లించే పరిహారంతో మరో చోట భూములను కొనలేం. తప్పెట్లమొర్సు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మాకు న్యాయమైన పరిహారం చెల్లిస్తేనే భూములను అప్పగిస్తాం.

– పగిడాల నర్సింహులు, తప్పెట్లమొర్సు

భూ సేకరణపై

రైతులతో చర్చిస్తాం

ముచ్చోనిపల్లె రిజర్వాయర్‌ అలుగు కాలువ నిర్మాణం విషయంలో రైతులతో సంప్రదింపులు చేస్తున్నాం. అడిషనల్‌ కలెక్టర్‌, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ద్వారా తప్పెట్లమొర్సు గ్రామస్తులతో భూ సేకరణకు రైతులు సహకరించేలా చర్చలు జరిపాం. రైతులు అంగీకరించడం లేదు. అలైన్‌మెంట్‌ ప్రకారమే ముచ్చోనిపల్లె అలుగు కాలువను నిర్మించాల్సి ఉంటుంది. భూ సేకరణ సమస్య కారణంగా అలుగు కాలువ ఏర్పాటులో జాప్యం నెలకొంది. రైతులు సహకరిస్తే త్వరగా పూర్తి చేసి, రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నీటితో నింపి ఆయకట్టుకు నీరందిస్తాం. – నవీన, డీఈ

వెంటాడుతున్న వరదల భయం

ముచ్చోనిపల్లె రిజర్వాయర్‌కు వరద నీరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ రిజర్వాయర్‌ కింద ఉన్న ఎక్లాస్‌పూర్‌, అయిజ పట్టణాల ప్రజలను వరదల సమయంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటారు. 2009 వరదలు అయిజ పట్టణ ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. అప్పట్లో వరదల సందర్భంలో అసంపూర్తిగా ఉన్న ముచ్చోనిపల్లె రిజర్వాయర్‌లోకి మాచర్ల, గట్టు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాగు దగ్గర అసంపూర్తిగా ఉన్న మట్టి కట్ట వరద నీటి ఉధృతికి తెగిపోయింది. అప్పట్లో అర టీఎంసీ నీరు వృథాగా వాగు ద్వారా తుంగభద్ర నదికి చేరుకుంది. ప్రస్తుతం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున వరదలు వస్తే రిజర్వాయర్‌ కింద ఉన్న గ్రామాల పరిస్థితి ఏంటని ఆయా గ్రామాల ప్రజలు అందోళన చెందుతున్నారు.

వరదొస్తే నీరు బయటికి పారే దారే కరువు

జఠిలంగా మారిన భూసేకరణ

1.5 టీఎంసీల సామర్థ్యం.. రూ.38.25 కోట్లతో రిజర్వాయర్‌ నిర్మాణం

సగం నీటితోనే సరిపెట్టేస్తున్న అధికారులు

ముచ్చోనిపల్లికి ముప్పు..! 1
1/1

ముచ్చోనిపల్లికి ముప్పు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement