
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
రాజోళి: వారం రోజులుగా నీరు రావడం లేదని కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిదిలోని రామచంద్రానగర్ కాలనీలో గత వారం రోజులుగా మిషన్ భగీరథ ద్వారా నీరు అందడం లేదు. కనీసం తాగేందుకు, ఇతర అవసరాలకు కూడా నీరు లేదు. అధికారులను అడిగితే మోటార్లు రిపేరు చేస్తున్నామని చెప్పి మాట దాటేస్తుండటంతో విసిగిపోయిన కాలనీ వాసులు ఆదివారం కాలనీలోని రోడ్డెక్కి ఖాళీ బిందెలను ప్రదర్శిస్తూ, నిరసన తెలిపారు. అనంతరం కర్నూల్–రాయచూరు ప్రధాన రహదారిపైన ధర్నా చేసేందుకు సమాయత్తం అయ్యారు. గత వారం రోజులుగా నీరు లేక ఇళ్లలో బడికి వెళ్లే పిల్లలు, పనులకు వెళ్లే పెద్దలు స్నానాలు చేయడం లేదని కాలనీవాసులు వాపోయారు. మోటార్లు రిపేరు ఉన్నాయని తెలిసిన అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసైనా ప్రజలకు నీరు అందించాలి కదా, ఆ పని కూడా చేయకపోతే నీటి అవసరాలు ఎలా తీరతాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెలలో రెండు మూడు సార్లు ఇలా జరుగుతూనే ఉంటుందని, దీనిపై అధికారులకు చెప్పినా ప్రయోజనం లేదని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ధర్నాకు ఉపక్రమించారు.ఈ క్రమంలో విషయం తెలసుకున్న బీఆర్‌ఎస్ యువకులు బార్గవ్ యాదవ్, నాయకులు గడ్డం శ్రీను అక్కడకు చేరుకుని మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించగా ట్యాంకర్ కాలనీకి చేరుకుంది. దీంతో కాలనీ వాసులు ధర్నా విరమించారు. కనీసం చేతిపంపులు కూడా లేవని, శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.