
భూ సేకరణే అసలు సమస్య..
ముచ్చోనిపల్లె రిజర్వాయర్ అలుగు కాల్వవను రెండున్నర కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటికే రెండు రిజర్వాయర్లలో భూములు కొల్పోయిన తప్పెట్లమొర్సు గ్రామ రైతులు మళ్లీ భూములను కాలువ కోసం అప్పగించడానికి సిద్ధంగా లేరు. తప్పెట్లమొర్సు గ్రామ శివారులో మొత్తం 3600 ఎకరాల భూములుండగా ఇందులో 600 ఎకరాలు సాగు పనికిరానివి ఉండగా, తాటికుంట రిజర్వాయర్‌లో 630 ఎకరాలు, ముచ్చోనిపల్లె రిజర్వాయర్‌లో 670 ఎకరాలు, కాలువల నిర్మాణం కోసం 200 ఎకరాలు సేకరించినట్లు రైతులు తెలిపారు. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం భారత్‌మాల 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణం కోసం భూ సేకరణ చేశారు. రెండు రిజర్వాయర్ల కారణంగా ఎక్కువగా భూములను కొల్పోయిన ఈ రైతులు ఉన్న కొద్ది పాటి భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే బహిరంగ మార్కెట్‌లో భూమి విలువకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తే భూములను అప్పగించేందుకు రైతులు సముఖతను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, గొర్లఖాన్‌దొడ్డి–అయిజ రోడ్డు నుంచి ముచ్చోనిపల్లె రిజర్వాయర్ కట్ట కింద నుంచి బల్గెర–అయిజ రోడ్డుకు లింకు కలిపే కొత్త తారు రోడ్డును మాత్రం వేశారు. కొత్తగా తారు రోడ్డు వేసే అధికారులు రిజర్వాయర్ అలుగు కాల్వకు ఎందుకు పరిష్కారం చూపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.