
మావాడే వదిలెయ్..!
మావాడే వదిలేయ్..!
అద్దె బకాయి వసూళ్లలో మోకాలడ్డుతున్న నాయకులు
దూకుడు పెంచిన అధికారులు
గద్వాల మున్సిపాలిటీ పరిధిలో 236 దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.1.13 కోట్లు ఆదాయం అద్దె రూపంలో రావాల్సి ఉంది. అయితే కొంత మంది దుకాణాదారులు నెలలు, ఏళ్ల తరబడి అద్దెలు చెల్లించకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. సుమారు రూ.3 కోట్ల వరకు అద్దె బకాయిలు ఉన్నాయి. దీనిపై ఈ నెల 19న ‘పేరుకుపోయిన బకాయిలు అనే శీర్షికతో ‘సాక్షిశ్రీలో కథనం ప్రచరితం అయింది. ఈ కథనానికి ఉన్నతాధికారులు స్పందించి బకాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా గత నాలుగు రోజుల నుంచి అద్దె బకాయిల లిస్టు చేత పట్టి వసూళ్లపై దూకుడు పెంచారు.. బకాయిలు చెల్లించని దుకాణాలకు తాళాలు వేశారు. దుకాణ అద్దె బకాయి చెల్లించే వరకు మున్సిపల్ సిబ్బంది కట్టు కదలడం లేదు. ఈ క్రమంలో దుకాణాదారులు మున్సిపల్ అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాజీ కౌన్సిలర్లు, రాజకీయ నాయకుల అధికారులు, సిబ్బందిపై హెచ్చరికలు జారీ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులు రోజువారి లక్ష్యాలు నిర్దేశిస్తుండటం.. నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తుండటంతో మున్సిపల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
గద్వాలటౌన్: కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.. అన్న చందంగా తయారైంది మున్సిపల్ అధికారుల పరిస్థితి. పట్టణంలో మున్సిపల్ దుకాణాల అద్దె బకాయి వసూళ్లకు ఉన్నతాధికారులు లక్ష్యాలు విధించారు. రోజువారి వసూళ్లకు రాజకీయ నేతలు మోకాలడ్డుతున్నారు. ఎవరి దగ్గరకు వెళ్లినా మాజీ కౌన్సిలర్లు, లేదా పెద్ద రాజకీయ నాయకులతో సిఫార్సులు చేయిస్తున్నారు. లేదా చెల్లించమని బెదిరిస్తున్నారు. దీంతో దుకాణాల అద్దెలు వసూలు కాక ఉన్నతాధికారులకు సమాధానాలు చెప్పలేక నలిగిపోతున్నారు. ఇదీ జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీలో అధికారుల పరిస్థితి.
ఇరువైపులా ఒత్తిళ్లు
ఇలా పన్నుల వసూలు చేసే అధికారులకు, సిబ్బందికి మున్సిపల్ దుకాణదారులు అద్దె బకాయి చెల్లింపుల్లో మున్సిపాలిటీ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు రోజుకు ఎన్ని లక్షలు వసూలు చేశారని పుర ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. దుకాణాల అద్దె వసూళ్ల రూపంలో వచ్చే ఆదాయమే ప్రధానం. పట్టణంలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా... పారిశుద్ధ్యం, తాగునీరు సరాఫరా వంటి సేవలు అందించాలన్నా పన్నులు, దుకాణాల అద్దె వసూళ్లు బాగుంటేనే సాధ్యమవుతుంది. కానీ భవన నిర్మాణదారులు ఆస్తిపన్ను ఎలాగోలా చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. కొందరు దుకాణదారులు మాత్రం అద్దె బకాయిలు చెల్లించడానికి ససేమిరా అంటున్నారు. చెల్లింపుల్లో రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లతో సిఫార్సులు చేయిస్తున్నారు. దీంతో అద్దె బకాయి వసూళ్లకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
గద్వాలలో దాదాపు
రూ.కోటికిపైగా పెండింగ్..
‘సాక్షి’ కథనంతో దూకుడు పెంచిన
అధికారులు

మావాడే వదిలెయ్..!