
వైద్య సేవలు ప్రారంభం
● వంద పడకల ఆస్పత్రిలో కాంగ్రెస్ నాయకుల సంబరాలు
బీజేపీ పోరాటంతోనే..
బీజేపీ పోరాట ఫలితంగానే అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వంద పడకల ఆస్పత్రి కోసం గతంలో అనేక ఉద్యమాలు, అందోళనలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గత నెల జూన్‌లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి అధికారులపై తీవ్ర ఒత్తిడికి తెచ్చినట్లు తెలిపారు. దీంతో అధికారులు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారని వివరించారు.
అలంపూర్: రెండేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో బుధవారం వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఓపీ సేవలను ప్రారంభించారు. ఈమేరకు ఆస్పత్రికి ఏడుగురు వైద్యులు, 12 మంది నర్సులు, వార్డు బాయ్స్, ఇతర సిబ్బందిని నియమించారు. వైద్య విధాన పరిషత్ ఉమ్మడి జిల్లా అధికారి రమేష్ చంద్ర ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని ఓపీ సేవలను ఆయన పరిశీలించారు. ఇదిలాఉండగా, గద్వాల ఆస్పత్రి నుంచి ఏడుగురు వైద్యులు వచ్చారని, ప్రస్తుతం ఓపీ సేవలు కొనసాగుతాయని సివిల్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. గైనకాలజిస్టు, కంటి, చిన్న పిల్లల, జనరల్ వంటి సేవలు అందించేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించడానికి మరో రెండు మూడు నెలలు పట్టనుందని, పూర్తి స్థాయి వైద్యులు, నర్సులు, సిబ్బంది నియామకానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఎమర్జన్సీ సేవలు సైతం త్వరలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు అమీర్, జెమ్స్, శ్యామ్, సిస్టర్స్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
ప్రజా పాలనలోనే అందుబాటులోకి
వైద్య సేవలు
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలోనే వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ దొడ్డెన్న, మండల అధ్యక్షుడు గోపాల్ అన్నారు. ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభం కావడంతో సంబరాలు నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకొని, వైద్యులను, వైద్య సిబ్బందిని సత్కరించి మిఠాయిలను పంపిణీ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఆస్పత్రిని హడావుడిగా ప్రారంభించి తర్వాత వదిలేసిందన్నారు. వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, మాజీ జడ్పీటీసీ మద్దిలేటి, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షుడు గోపాల్, జగన్‌మోహన్ నాయుడు, అడ్డాకుల రాము, భైరాపురం రమణ, నాయకులు నర్సన్ గౌడు, నగేష్, శంకర్, శ్రీకాంత్, కృష్ణ, మక్బుల్, మోక్తార్ బాష తదితరులు ఉన్నారు.