
ఎరువులు అందుబాటులో ఉంచాలి
మల్దకల్: ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడంతో పాటు అధిక ధరలకు విక్రయించే ప్రైవేటు డీలర్లపై కఠన చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం. సంతోష్ హెచ్చరించారు. బుధవారం మల్దకల్‌లోని సింగిల్‌విండో కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాంలో నిల్వ ఉన్న 35 బస్తాల యూరియాను పరిశీలించి ఎరువుల పంపిణీ ఎలా నిర్వహిస్తున్నారని సీఈఓ కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆరా తీశారు. ప్రభుత్వ ధరకే ఎరువులు విక్రయించాలన్నారు. రైతులు సింగిల్‌విండో ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని వివిధ ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ప్రతి కొనుగోలుకు రషీదులు ఇవ్వాలని, ఈ –పాస్ మెషిన్ ద్వారానే పంపిణీ చేయాలని, స్టాక్ వివరాలను ఎప్పటికప్పడు రికార్డులలో పొందుపరచాలన్నారు. అనుమతులు లేని ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పడు ఎరువులు దుకాణాలను తనిఖీలు చేయాలన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలి
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మల్దకల్ పీహెచ్‌సీని తనిఖీ చేసి వైద్య సిబ్బంది హాజరు రిజిస్టార్ రికార్డులను పరిశీలించారు. గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని విధిగా తీసుకునేలా అవగాహన కల్పించాలని, ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, జిల్లా కో ఆపరేరిటివ్ అధికారి శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ సిద్దప్ప, ఇన్‌చార్జి డీఏఓ సక్రియనాయక్, ఏడీఏ సంగీతలక్ష్మీ, తహసీల్దార్ ఝూన్సీరాణి, ఎంపీడీఓ సాయిప్రకాష్, ఎంపీఓ రాజ శేఖర్, డాక్టర్ స్వరూపరాణి పాల్గొన్నారు.
అధిక ధరలకు విక్రయిస్తే
ప్రైవేట్ డీలర్లపై చర్యలు
స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు
రికార్డుల్లో పొందుపర్చాలి
కలెక్టర్ బీఎం సంతోష్