పీయూలో ఏం జరుగుతోంది? | - | Sakshi
Sakshi News home page

పీయూలో ఏం జరుగుతోంది?

Jul 23 2025 12:27 PM | Updated on Jul 23 2025 12:27 PM

పీయూల

పీయూలో ఏం జరుగుతోంది?

బదిలీల పరంపర..

నాన్‌ టీచింగ్‌ సిబ్బందిపై వేధింపుల పర్వం

ఇటీవల పలువురిపై సస్పెన్షన్‌ వేటు

చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీల ఏర్పాటు

వేతనాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు

టీచింగ్‌ సిబ్బందిలో సైతం అధికారుల తీరుపై తీవ్ర అసహనం

సిబ్బంది తరఫున

పోరాడతాం..

సిబ్బంది చిన్నచిన్న తప్పిదాలు చేస్తే వారిని విచారణ చేయాలి.. నోటీసులు ఇవ్వాలి.. కానీ, నేరుగా సస్పెండ్‌ చేయడం అనేది సిబ్బందిని వేధింపులకు గురిచేయడమే. బాధిత సిబ్బంది తరఫున మే ము పోరాటం చేస్తాం. అధికారులు అణచివేత ధోరణి అవలంబించడం సరైంది కాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారుల వ్యవహారశైలిని ఖండిస్తున్నాం. వేతనాలు పెంచకుండా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయవద్దు.

– రాము, పీయూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

అందరినీ సమానంగా చూస్తాం..

పీజీ కళాశాలలో సిబ్బంది నేరుగా సంతకం పెట్టి వెళ్లిపోతున్నట్లు తెలిసింది. అప్పటికే సంతకం పెట్టి బయటికి వెళ్తున్న ఓ సిబ్బందిని ఎక్కడికి వెళ్తున్నావని అడిగా.. సంతకం పెట్టి బయటికి పోతే ఎలా అని సస్పెండ్‌ చేశాం. సిబ్బంది పైనా మాకు కోపం లేదు. అందరినీ సమానంగా చూస్తాం. వేతనాల పెంపునకు కృషి చేస్తున్నాం. వేసవి సెలవుల్లో నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి సెలవులు ఉండవు. గతంలో ఎలా ఇచ్చారో నాకు తెలియదు. – రమేష్‌బాబు, రిజిస్ట్రార్‌, పీయూ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై వేధింపుల పర్వానికి తెరలేపారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే ముగ్గురు సిబ్బందిపై సస్పెషన్‌ వేటు వేసి తమలోని అక్కసును బయటపెట్టుకున్నారు. దీంతో పాటు నాన్‌టీచింగ్‌ సిబ్బంది చేసే చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీలు వేసి భయాందోళనకు గురిస్తున్నారు. వేసవిలో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించిన అధికారులు.. నాన్‌టీచింగ్‌ సిబ్బందికి మాత్రం ఒక్క సెలవు ఇవ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన సిబ్బందిని కనీసం అధికారులు వారి చాంబర్‌లోకి కూడా రానివ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం తమకు వేతనాలు పెంచమని కోరినందుకే అణచివేత ధోరణికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీయూలో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్‌ సిబ్బందిలో కిందిస్థాయి వారికి రూ.6 వేల నుంచి మధ్యస్థాయి వరకు రూ.15 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు.

ఏం మాట్లాడితే ఏం చేస్తారో..

మూడు రోజుల క్రితం విధుల్లో ఉన్న పీయూ పీజీ కళాశాల ఓ మహిళా నాన్‌టీచింగ్‌ సిబ్బంది తన కొడుకుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్తుండగా.. రిజిస్ట్రార్‌ అడ్డుకుని సదరు మహిళను సస్పెండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. రిజిస్ట్రార్‌ తీరుతో నాన్‌టీచింగ్‌ సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎలాంటి విచారణ, హెచ్చరిక, నోటీస్‌ లేకుండా సస్పెన్షన్‌ వేటు వేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు గతంలో ఓ టీచింగ్‌, ఓ నాన్‌టీచింగ్‌ గొడవపడిన వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన అధికారులు నేరుగా నెల రోజుల పాటు సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. మరో ఇద్దరు సిబ్బంది చిన్నచిన్న తప్పిదాలు చేశారన్న ఆరోపణలతో వారిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీలు వేశారు. దీంతో ఏం మాట్లాడితే.. ఏం చేస్తారోనన్న భయాందోళన నాన్‌ టీచింగ్‌ సిబ్బందిలో నెలకొంది.

నాన్‌టీచింగ్‌లో రెగ్యులర్‌ ప్రతిపాదిక పనిచేస్తున్న అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌కు సైతం వేధింపులు తప్పలేదు. తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఆయనను ఎలాంటి కారణం చెప్పకుండా నేరుగా ఎగ్జామినేషన్‌ విభాగానికి బదిలీ చేశారు. అంతేకాకుండా మరో నాన్‌టీచింగ్‌ సిబ్బందిని సరిగా విధులకు రావడం లేదన్న కారణంతో ఫార్మసీ కళాశాలకు బదిలీ చేసి.. అక్కడి నుంచి గద్వాల పీజీ కళాశాలకు బదిలీ చేసి అక్కడి వెళ్లాలని సూచించారు. చాలా రోజులుగా వైస్‌ చాన్స్‌లర్‌ను కలిసి సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే కనీసం చాంబర్‌లోకి సైతం రానివ్వలేదని తెలిసింది. అంతేకాకుండా మరో మహిళా సిబ్బందిని ఎలాంటి కారణం లేకుండా నేరుగా ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. గతంలో తప్పిదాలు చేసి బదిలీపై వెళ్లిన వారిని ప్రస్తుత అధికారులు పైరవీలు చేసి తిరిగి అడ్మినిస్ట్రేషన్‌ బ్రాంచ్‌కు రప్పించుకుంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరిపై విచారణ కోసం కమిటీలు వేసి, వారి వివరణ సైతం తీసుకుంటున్నారు. ఇలాంటి ధోరణితో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.

ఇటీవల అన్ని హాస్టళ్లకు కలిపి ఒక రెగ్యులర్‌ అధ్యాపకుడిని చీఫ్‌ వార్డెన్‌గా నియమించారు. ఇందులో రెండు బాలికల హాస్టళ్లు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో బాలికల హాస్టల్‌కు గతంలో ఉన్న చీఫ్‌ వార్డెన్‌ (మహిళ)ను తప్పించి పురుష అధికారిని నియమించారు. బాలికల హాస్టల్‌లో సమస్యలు, ఇబ్బందులు వస్తే వారు ఆయనకు ఎలా చెప్పుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది.

టీచింగ్‌ సిబ్బందిలోనూ అసంతృప్తి..

పీయూలో ప్రొఫెసర్‌ స్థాయి లెక్చరర్లు ఉన్నప్పటికీ రిజిస్ట్రార్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకోవడంపై రెగ్యులర్‌ టీచింగ్‌ సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా గతంలో అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారిని దూరంగా పెట్టడం, సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పీయూలో ఏం జరుగుతోంది? 1
1/2

పీయూలో ఏం జరుగుతోంది?

పీయూలో ఏం జరుగుతోంది? 2
2/2

పీయూలో ఏం జరుగుతోంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement