
ఎట్టకేలకు..!
రెండేళ్ల తర్వాత అందుబాటులోకి..
2023 అక్టోబర్ 5న ఆస్పత్రి ప్రారంభం
మెరుగైన వైద్యసేవల కోసం నియోజకవర్గ ప్రజల ఎదురుచూపులు
అలంపూర్: ఎట్టకేలకు వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభం కానున్నాయి. ఆస్పత్రి ప్రారంభించిన దాదాపు రెండేళ్ల తర్వాత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 23వ తేదీ బుధవారం ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ సయ్యద్ బాష తెలిపారు. వైద్యుల సమక్షంలో ఓపీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదట తాత్కాలిక వైద్య సేవలు అందించాలని వైద్య శాఖ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.
ఇదిలాఉండగా, వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా నిరంతరం వార్ కొనసాగుతుంది. దీంతో అధికార యంత్రంగా ఓపీ సేవలతో ఆస్పత్రిలో వైద్యం అందించడానికి సిద్ధమయ్యారు. అలంపూర్ ప్రజల వైద్య కష్టాలు దూరం చేయడానికి 2018 ఫిబ్రవరిలో ఆస్పత్రి నిర్మాణానికి పాలన అనుమతులు వచ్చాయి.
అలంపూర్ చౌరస్తాలో రూ.23.38 కోట్లతో వంద ఆస్పత్రి నిర్మాణానికి నిధులు వెచ్చించారు. వంద పడకలలో 50 పడకలు మాతా శిశు వైద్యానికి మరో 50 పడకలు సాధారణ వైద్య సేవలకు కేటాయించారు. అందుకు సంబంధించిన నిధులను సైతం పాలన అనుమతుల్లో పొందుపర్చడం జరిగింది. ఆ మేరకు ఆస్పత్రి నిర్మాణానికి బీజం పడింది.
ఇబ్బందులు తప్పుతాయి..
వంద పడకల ఆసుపత్రిలో వైద్యసేవలు ప్రారంభం కావడం హర్షనీయం. ఇన్నాళ్లు వైద్య సేవల కోసం ఎక్కడికెక్కడికో వెళ్లే వాళ్లం. వ్యాధుల భారిన పడితే చాలు అటు కర్నూల్ అయినా జిల్లా కేంద్రం, మహబూబ్‌నగర్ ఆస్పత్రులకు వెళ్లే వాళ్లం. అలంపూర్‌లో ఆస్పత్రిలో వైద్యసేవలు అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఊరట కలగనుంది.
– జెమిని మద్దిలేటి, అయిజ
ఎన్నాళ్లుగానో ఎదురుచూశాం
అలంపూర్ చౌరస్తాలో 100 పడకల ఆసుపత్రిలో వైద్యసేవలు అందించడంతో పేద ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. ఎంతోకాలంగా వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఆసుపత్రిలో సేవలు అందుబాటులోకి వస్తే ఆ కష్టాలు తీరుతాయి. జాతీయ రహదారి, రాష్ట్రానికి సరిహద్దు కావడంతో అత్యవసర సేవలు పొందే అవకాశం ఉంటుంది.
– అడ్డాకుల రాము, లింగనవాయి
మొదట ఓపీ సేవలు..
వంద పడకల ఆస్పత్రిలో బుధవారం నుంచి వైద్యసేవలు ప్రారంభించనున్నాం. మొదట ఓపీ సేవలు అందించనున్నాం. అనంతరం విడతల వారీగా అప్‌గ్రేడ్ చేస్తాం.
– సయ్యద్‌పాషా, వంద పడకల ఆస్పత్రి సూపరింటెండ్, అలంపూర్

ఎట్టకేలకు..!