
ఆయిల్‌పాం సాగుతో నిరంతర ఆదాయం
ఎర్రవల్లి: ఆయిల్‌పాం సాగు ద్వారా రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతుందని జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లి మండల పరిదిలోని బీచుపల్లి ఆయిల్ ఫెడ్ నర్సరీలో ఉద్యానశాఖ, తెలంగాణ ఆయిల్‌ఫెడ్ సహకారంతో జిల్లా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని వివిద క్షేత్ర స్థాయి అధికారులకు ఆయిల్‌పాం సాగుపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 3500 ఎకరాల ఆయిల్‌పాం పంట సాగు లక్ష్యాన్ని కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా ఉద్యానశాఖ, తెలంగాణ ఆయిల్‌ఫెడ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని వివిధశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఆయిల్‌పాం పంట అనేది ఒకసారి వేసుకుంటే దాదాపు 30 సంవత్సరాల వరకు రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుందన్నారు. చీడపీడల బెడద తక్కువగా ఉండి అకాల వర్షాలకు, వడగండ్లకు ఈ పంటకు ఎలాంటి నష్టం జరగకుండా సుస్థిర దిగుబడులకు అవకాశం ఉంటుందన్నారు. రైతుల నుంచి నేరుగా కంపెనీ కొనుగోలు చేస్తారని, నాణ్యమైన మొక్కలను ప్రభుత్వ పరంగా రైతులకు కేవలం రూ.20 లకే ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం డ్రిప్ సదుపాయంతో సన్న, చిన్న కారు రైతులకు 90శాతం, పెద్దకారు రైతులకు 80శాతం సబ్సిడీపై అందజేయనున్నట్లు వివరించారు. అలాగే పంట నిర్వహణకు రూ.2100, అంతర పంటల సాగుకు రూ.2100.. ఇలా ఎకరానికి రూ. 4200 చొప్పున ఏటా రైతు ఖాతాలో జమ చేస్తామన్నారు. నాలుగేళ్లకుగాను రూ.16,800 రైతులు సబ్సిడీ ద్వారా పొందవచ్చునని, రైతులకు ఎలాంటి మార్కెటింగ్ ఇబ్బందులు కూడా లేకుండా ఉంటుందన్నారు. రైతులు ఈ ఆయిల్‌పాం సాగువైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. శివనాగిరెడ్డి, రాజశేఖర్, ఎపీఓలు, ఈసీలు, టీఏలు, ఎఫ్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.