
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. అనుమానాస్పద కేసులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చూడాలని, అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయిని కట్టడి చేయాలని ఆదేశించారు. ఈమేరకు సరిహద్దు ప్రాంతాల్లో పట్టిష్ట నిఘా ఉంచాలని, స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎవరైన ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన అనర్హత వేటు తప్పదన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్‌లో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్‌ఐలు, కళ్యాణ్‌కుమార్, శ్రీకాంత్, వెంకటేష్, శ్రీనివాసులు, నాగశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.