
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
గద్వాల: శిక్షణా కాలంలో నేర్చుకున్న నైపుణ్యాలను విధుల నిర్వహణలో పకడ్బందీగా నిర్వర్తించి మంచి పేరు సంపాదించాలని అడిషనల్ కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో లైసెన్స్‌డ్ సర్వేయర్ శిక్షణ పొందిన అభ్యర్థులకు నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. భూపరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని, రెవెన్యూ, సర్వే విభాగాలు పరస్పరంగా అనుసంధానమై ఉన్నాయన్నాన్నారు. సర్వే విభాగం బలోపేతంతోనే రెవెన్యూ వ్యవస్థలో సమర్థవంతమైన సేవలందించగలమన్నారు. భూభారతి సాఫ్ట్‌వేర్ ద్వారా భూమికి సంబంధించిన సర్వేలు, మ్యాపింగ్, డాటా ప్రాసెసింగ్ వంటి సేవలను మరింత ఖచ్చితంగా వేగంగా ప్రజలకు చేరువగా అందించగలుతున్నామని చెప్పారు. జిల్లాలో లైసెన్స్‌డ్ సర్వేయర్ శిక్షణ పొందిన 151మంది అభ్యర్థులకు హాల్‌టికెట్లు మెయిల్ నుంచి డౌన్‌లోడ్ చేసి అందజేయాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు తుదిరాత పరీక్షలు జూలై 27న నిర్వహించనున్నట్లు, జూలై 28–29తేదీన ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. అంతకు ముందు సర్వే ఏడీ రాంచందర్ సాఫ్ట్‌వేర్‌పై అవగాహన కల్పించేందుకు అభ్యర్థులకు పీపీటీ విధానం ద్వారా వివరంగా వివరించారు. కార్యక్రమంలో మండలాలకు చెందిన సర్వేయర్లు, శిక్షణపొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు.