
కార్యకర్తలను విస్మరిస్తే గాంధీభవన్‌ను ముట్టడిస్తాం
గద్వాల: పార్టీ కార్యకర్తలను విస్మరిస్తే గాంధీభవన్‌ను ముట్టడిస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ.. గద్వాలలో బీసీ నాయకత్వానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు కృషి చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కొనసాగుతుంటే గద్వాలలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయన్నారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు నామినేటెడ్ పదువులు గాని సంక్షేమ ఫలాలు గాని ఏమాత్రం పొందడం లేదన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ బిడ్డ అయిన సరిత స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ గద్వాలలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కానీ, బీసీ నాయకత్వంపై అధిష్టానం వివక్షపూరితంగా వ్యవహరిస్తుందని, గద్వాలలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండాలంటే సరిత వర్గీయులకే ఇందిరమ్మ కమిటీలు, ఇందిరమ్మ ఇళ్ల పంిపిణీలో అవకాశం కల్పించాలన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే తాను ఏ పార్టీలో ఉన్న విషయం కూడా స్పష్టం చేయకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ సమావేశాల్లో ఏవిధంగా పాల్గొంటారని ప్రశ్నించారు. మొదటి నుంచి పార్టీకోసం కష్టించి పనిచేసిన వారికి కాకుండా దొడ్డిదారిలో వచ్చిన వారికి స్థానిక సంస్థల ఎన్నికలో బీ–ఫామ్‌లు అందజేస్తే గద్వాల నుంచి పాదయాత్రగా వచ్చి గాంధీభవన్‌ను ముట్టిడిస్తామని హెచ్చరించారు. మధుసూదన్‌బాబు, బలిగేర నారాయణరెడ్డి, శంకర్, ప్రముఖ న్యాయవాదిషఫిఉల్లా, ఇసాక్, వెంకటస్వామిగౌడ్, గోనుపాడు శ్రీనివాస్‌గౌడ్, పెద్దపల్లి రాజశేఖర్‌రెడ్డి, తిరుమలేష్, పులిపాటి వెంకటేష్, డీఆర్ శ్రీధర్, కోటేష్, వాకిటి సంజీవులు పాల్గొన్నారు.