
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన విధంగా పేద రెడ్ల అభ్యున్నతి కోసం రెడ్డి కార్పొరేషన్‌కు చట్టబద్ధత కల్పించి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రస్థాయిలో నిర్వహించే అన్ని విద్య, ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. తమ సంస్థ ద్వారా చదువులో ముందంజలో ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. అలాగే పలు ప్రమాదాల్లో గాయపడిన పేద రెడ్లకు వైద్య సహాయం కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్‌రెడ్డి, కోశాధికారి నర్సింహారెడ్డి, సహధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, ప్రచార కార్యదర్శి సురేందర్‌రెడ్డి, కార్యదర్శి కోటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.