
ప్లాస్టిక్ నిషేధం.. అమలైతేనే ప్రయోజనం
జిల్లావ్యాప్తంగా
ప్లాస్టిక్ వినియోగంపై ముమ్మరంగా తనిఖీలు
● పూర్తిస్థాయిలో అరికట్టేందుకు మరోసారి అడుగులు
● కలెక్టర్ దిశానిర్దేశంతో కఠిన చర్యలకు ఉపక్రమణ
● నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 10 టన్నులు సేకరణ
ముమ్మరంగా తనిఖీలు..
ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధానికి అధికారులు మళ్లీ నడుం బిగించారు. గడిచిన కొన్ని రోజులుగా ఆయా మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా జిల్లాకేంద్రమైన గద్వాలలో ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. కలెక్టర్ సంతోష్ ఆదేశాలతో నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో దుకాణాలపై దాడులు చేసి చర్యలు తీసుకుంటున్నారు. కూరగాయల మార్కెట్‌తోపాటు హోల్‌సేల్, రిటేల్ దుకాణాల్లో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని కార్యాయాలకు తరలించారు. ఆయా పార్టీల నుంచి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడా తగ్గకుండా దాడులు కొనసాగిస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
గద్వాల టౌన్: ఉదయం నుంచి నిద్రించే వరకు ప్లాస్టిక్‌తో మానవ జీవితం ముడిపడి ఉంటోంది. అంతలా కలిసిపోయిన దీంతో పర్యావరణంతోపాటు మానవవాళికి ముప్పుపొంచి ఉందని తెలిసినా వినియోగిస్తూనే ఉన్నాం. పర్యావరణ వేత్తలు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. కొద్దిగానైనా మార్పు రావడం లేదు. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా వీటి వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. పట్టణాల్లోని రహదారుల పక్కన, నివాస గృహల సమీపంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌పై నిషేధం ఉండేది. ప్రస్తుతం 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సమస్యలను అధిగమించాలంటే వ్యక్తిగతంగా, సమష్టిగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని.. అప్పుడే పర్యావరణ ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మార్పు వచ్చినట్టే వచ్చి..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో సుమారు 30 వేల నివాస గృహాలు, దుకాణాలు ఉన్నాయి. దీంతో ప్రతిరోజు 80 టన్నుల చెత్త పోగవుతోంది. అందులో 10 టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. గతంలోనే గద్వాల, అయిజ మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు చేశారు. అప్పట్లో అడపాదడపా దుకాణాలపై దాడులు నిర్వహించారు. రూ.100 నుంచి రూ.5 వేల వరకు జరిమానా సైతం విధించారు. తదనంతరం అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తిరిగి వాటి విక్రయాలను మొదలుపెట్టారు. ఏళ్ల తరబడి ప్రణాళిక రూపొందిస్తున్నా.. కౌన్సిల్‌లో తీర్మానాలు చేస్తున్నా.. అమలులో క్షేత్రస్థాయి లోపాలతో అడ్డుకట్ట పడటం లేదు.
ప్రజల్లో మార్పు రావాలి..
ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. పాలిథీన్ కవర్లకు బదులు ఇతర సంచులు వాడాలని, తద్వారా ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యమవుతుందని చెబుతున్నాం. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే వంద శాతం ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యమవుతుంది. ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే జరిమానాలతో పాటు దుకాణం లైసెన్సు రద్దు చేస్తాం. – దరశథ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల

ప్లాస్టిక్ నిషేధం.. అమలైతేనే ప్రయోజనం

ప్లాస్టిక్ నిషేధం.. అమలైతేనే ప్రయోజనం