
గుట్టుగా గంజాయి దందా
బానిసలుగా మారుతున్న యువత, కార్మికులు
●
గద్వాల క్రైం: నడిగడ్డలో గంజాయి విక్రయాలు గుట్టుగా సాగుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లో యువకులు మొదలుకొని కార్మికులు ఈ మత్తుకు బానిసలుగా మారి కుటుంబాలను చిద్రం చేసుకుంటున్నారు. తాజాగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు గమనించిన పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి.. ఎట్టకేలకు పక్కా సమాచారంతో దాడి చేసి గంజాయి అమ్మకాల గుట్టు రట్టు చేశారు. ఈ నెల 13వ తేదీన గద్వాల జిల్లాకు చెందిన ఓ యువకుడు గద్వాల వ్యవసాయ మార్కెట్‌లో గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు గుర్తించి అరెస్టు చేసి 680 గ్రాముల ఎండు గంజాయి (రూ. 27 వేల విలుగల) స్వాధీనం చేసుకోవడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. ఈ దందాలో ఇంకా ఎంత మంది ఉన్నారు, ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు, ఎలా దిగుమతి చేసుకుంటున్నారు.. అసలు సూత్రధారులు ఎవరనే విషయమై పోలీసులు కూపీ లాగుతున్నారు.
రిమాండ్‌కు తరలించాం..
జిల్లా కేంద్రంలో గంజాయి విక్రేయించేందుకు వచ్చిన యువకుడిని అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. గంజాయి తీసుకునే వారిలో యువత, కార్మికులు ఉన్నట్లు విచారణలో తెలిసింది. గంజాయిని హైదరాబాద్, షోలాపూర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు సదరు యువకుడు తెలిపాడు. త్వరలో వారిని సైతం గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అయితే నిందితుడిపై ఎన్‌డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాం.
– కళ్యాణ్‌కుమార్, పట్టణ ఎస్‌ఐ.
కట్టడికి ప్రత్యేక నిఘా
గంజాయి సరఫరా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. జిల్లాలో కొంతమంది యువకులు గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. వీరు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, దందాలో ఎంతమంది ఉన్నారనే విషయాలపై విచారణ జరుగుతుంది. యువత, ప్రజలు గంజాయికి దూరంగా ఉండాలి. ఆ మత్తుకు అలవాటు పడి జీవితాలను ఆగం చేసుకోవద్దు. జిల్లాలో గంజాయి అమ్మకాలు, వినియోగంపై సమాచారం తెలిస్తే పోలీసుశాఖకు తెలియజేయాలి. నిషేధిత మత్తు పదార్థాల కట్టడి, వాటితో వచ్చే సమస్యలపై అవగాహన సదస్సుల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాం.
– శ్రీనివాసరావు, ఎస్పీ
ఇటీవల జిల్లా కేంద్రంలో గంజాయి విక్రేత అరెస్టు
280 గ్రాముల
ఎండు గంజాయి స్వాధీనం
కూపీ లాగుతున్న పోలీసులు

గుట్టుగా గంజాయి దందా

గుట్టుగా గంజాయి దందా

గుట్టుగా గంజాయి దందా