గద్వాల: జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్‌ను త్వరలో రూపొందించనున్న నేపథ్యంలో సమగ్ర వివరాలు సమర్పించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌శాఖ హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ నర్సింహారెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల రూపకల్పనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా డ్రోన్ సర్వే ద్వారా సమగ్ర సమాచారం సేకరించినట్లు తెలిపారు. నివాస ప్రాంతాలు, పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధి జరగబోయే ప్రాంతాలను గుర్తించేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకుగాను సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ ప్లానింగ్, ఆరోగ్య, నీటివనరుల నిర్వహణ, పరిశ్రమల స్థాపన తదితర అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమగ్ర సమాచారం అందించాలని ఆదేశించారు. ఆమోదిత మాస్టర్ ప్లాన్ ప్రచురించి.. ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనల అనంతరం తుది ప్రణాళికలను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి వివరణాత్మక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖలు అందించాల్సిన సమాచారం, ఆయా శాఖల బాధ్యతలు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, మున్సిపల్ కమిషనర్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు.