జిల్లాలో రవాణాశాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్
●
స్పెషల్ డ్రైవ్ చేపట్టాం..
ట్యాక్స్ చెల్లించకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. సామర్థ్యానికి మించి సరుకులు రవాణా చేస్తున్న గూడ్స్ వాహనాలు, పర్మిట్, ఫిట్‌నెస్ తదితర అనుమతి పత్రాలు లేని వాహనాలకు రెట్టింపు జరిమానాలు విధిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 850 వాహనాలు సీజ్ చేశాం. అందులో ట్యాక్స్ చెల్లించని, ఫిట్‌నెస్ లేని వాటిని గుర్తించాం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరలోనే సాధిస్తాం.
– వెంకటేశ్వర్లు, డీటీఓ
గద్వాల క్రైం: వాహనాలకు సంబంధించిన పన్నుల వసూలుపై జిల్లా రవాణాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా సంబంధిత అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కొన్ని రోజులుగా ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. సకాలంలో ట్యాక్స్ చెల్లించని వాహనాలను సీజ్ చేస్తూ.. రెట్టింపు జరిమానా విధిస్తున్నారు. అన్ని రకాల అనుమతి పత్రాలు ఉంటేనే వాహనం రోడ్డెక్కాలని సూచిస్తున్నారు. మరోవైపు ట్యాక్స్ చెల్లించకుండా బకాయి పడిన వాహనదారులకు ఫోన్ ద్వారా లేదా మెసేజ్‌లతో అప్రమత్తం చేస్తు న్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 50.61 కోట్ల ట్యాక్స్ వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటి వరకు రూ. 39.38 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు గాను రవాణాశాఖ అధికారులు ట్యాక్స్ చెల్లించని వాహనదారుల భరతం పడుతున్నారు.
బకాయిలే లక్ష్యంగా..
రవాణాశాఖకు ట్యాక్స్‌లు చెల్లించని వాటిలో ట్రాక్టర్లు, మ్యాక్సీ క్యాబ్‌లు, గూడ్స్ వాహనాలు, ప్రైవేటు స్కూల్ బస్సులు, లారీలు తదితర వాహనాలు ఉన్నాయి. ఏడాదిలో నాలుగుసార్లు ట్యాక్స్ చెల్లించాల్సి ఉన్నా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మానవపాడు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద రవాణాశాఖ సిబ్బంది నిత్యం వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ట్యాక్స్‌లు చెల్లించని వాహనాలను సీజ్ చేసి.. ట్యాక్స్ చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపులోగా ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారు. మరోవైపు నూతన వాహనాలకు జీవిత పన్ను (లైఫ్ ట్యాక్స్) రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది.
ప్రధాన రహదారులపై విస్తృతంగా తనిఖీలు
అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాలపై కొరడా
రూ. 50.61కోట్లకు గాను రూ. 39.38కోట్ల పన్ను వసూలు
బకాయిలపై నజర్