కొత్తకోట రూరల్: మహిళలు ఆర్థికంగా ఎదగడం చాలా ముఖ్యమని.. నాబార్డ్ అందిస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డ్ మహబూబ్‌నగర్ క్లస్టర్ డీడీఎం మనోహర్‌రెడ్డి సూచించారు. మంగళవారం పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాలలో నాబార్డ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ వ్యవసాయ ఆర్థిక బలోపేతంతో గ్రామాలు గొప్పగా ఎదుగుతాయన్నారు. అనంతరం మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. పిడిగం సైదయ్య మాట్లాడుతూ.. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని.. అన్నిరంగాల్లో రాణించే శక్తి వారి సొంతమని కొనియాడారు. వ్యవసాయ రంగంలో విత్తనం పొలంలో నాటిన దగ్గర్నుంచి పంట ఉత్పత్తులు మార్కెట్‌లో విక్రయించే వరకు మహిళల పాత్ర కీలకమన్నారు. వ్యవసాయంలో రోజురోజుకు మహిళల ప్రాధాన్యం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. అనంతరం ఉత్తమ మహిళా రైతులు, ఉత్తమ స్వయం సహాయక బృందాల మహిళలను విద్యార్థులు, ప్రొఫెసర్లు సన్మానించారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా అడిషనల్ డీఆర్డీఓ భాస్కర్, వనపర్తి లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే, కళాశాల ఉమెన్ సెల్ ప్రొటెక్షన్ ఇన్‌చార్జ్ డా. ఆర్.పూర్ణిమా మిశ్రా, డా. విద్య, డా. గౌతమి, నవ్య, శ్వేత, ఏఈఓ రమేష్‌కుమార్, విద్యార్థినులు, స్వయం సహాయక బృందాల మహిళలు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.