మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్‌ల ఏర్పాటు
గద్వాలటౌన్: ఇన్నాళ్లు తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టిన ఇంటర్ విద్యార్థులు ఇప్పుడు పరీక్షలు సజావుగా రాస్తేనే మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుంటుంది. ఉత్తమ ఫలితాలు రాబట్టాలన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే ఆయా కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇదిలాఉండగా, నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్లు నర్సింగరావు, లక్ష్మినారాయణ సంబంధిత శాఖల అధికారులతో ఇప్పటికే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి పరీక్షలు సజావుగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగనున్నాయి. మాల్ ప్రాక్టీస్, చూచిరాతలు, ఒకరికి మరొకరు పరీక్ష రాయడం, ఇన్విజిలేటర్లు విధుల దుర్వినియోగం తదితర వాటికి తావులేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిచేందుకు ఏర్పాట్లు చేశారు.
14 కేంద్రాలు.. 8,341 మంది విద్యార్థులు
జిల్లాలో అన్ని వసతులు కలిగిన 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 8 ప్రభుత్వ కళాశాలలు, మిగిలినవి ప్రైవేటువి. మొదటి సంవత్సరంలో 4,057 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,260 మంది విద్యార్థులు జనరల్ పరీక్షలు, 797 మంది ఒకేషనల్ పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో 4,284 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో జనరల్ పరీక్షలు 3,396 మంది, ఒకేషనల్ పరీక్షలకు 715 మంది, 173 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరు కానున్నారు. మొత్తం 8,341 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. గద్వాలలో ఆరు, అయిజలో మూడు పరీక్షా కేంద్రాలతో పాటు అలంపూర్, మానవపాడు, ధరూరు, మల్దకల్, గట్టు ప్రభుత్వ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ‘పతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరిండెంట్‌తో పాటు డిపార్ట్‌మెంట్ అధికారిని ఏర్పాటు చేశారు. గద్వాలకు, అయిజలకు కస్టోడియన్‌ను నియమించారు. 20 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు.
వసతుల కల్పన..
విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా వసతులు కల్పించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఎండ తాకిడి తట్టుకోవడానికి వీలుగా పరీక్ష కేంద్రాల ఆవరణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రతి పరీక్ష కేంద్రంలో ముగ్గురు చొప్పున ఆరోగ్య కార్యకర్తలను నియమించారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో సమయానికి చేరుకునే విధంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. జిల్లాలో ఏ ఒక్క విద్యార్థి సైతం కింద కూర్చోకుండా బెంచీలను ఏర్పాటు చేశారు. పక్కా భవనాలు కలిగిన చోటనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూత్రశాలలు, విద్యుత్ సౌకర్యం, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాగునీరు ప్రతి కేంద్రంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు.
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
14 కేంద్రాలు.. హాజరుకానున్న
8,341 మంది విద్యార్థులు
నేటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ వార్షిక పరీక్షలు
నిర్దేశించిన సమయానికి చేరుకోవాలి
విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్ష కేంద్రాలలో పనిచేసే సిబ్బంది, అధికారులు, ఇన్విజిలేటర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డును తమ వద్ద ఉంచుకోవాలి. సెల్‌ఫోన్లను ఎవరూ పరీక్ష సమయంలో ఉపయోగించొద్దు. – హృదయరాజు, డీఐఈఓ, గద్వాల
నిఘా నీడలో పరీక్షలు