ఆచూకీ లభించేనా.? | - | Sakshi
Sakshi News home page

ఆచూకీ లభించేనా.?

Mar 5 2025 12:57 AM | Updated on Mar 5 2025 12:54 AM

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరం

ఎట్టకేలకు కన్వేయర్‌ బెల్టు పునరుద్ధరణ

ఎలాంటి సమాచారం బయటికి పొక్కనివ్వని అధికారులు

అందుబాటులోకి

కన్వేయర్‌ బెల్టు..

సొరంగంలో టీబీఎం మెషీన్‌తో పాటు పనిచేసే కన్వేయర్‌ బెల్టు ధ్వంసమైంది. దీంతో సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లను బయటికి తరలించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. సింగరేణి కార్మికులు పదుల సంఖ్యలో సొరంగంలోకి వెళ్లి పనులు చేసినప్పటికీ పురోగతి కనిపించలేదు. మట్టి, నీరు, బురదను బయటకు పంపడానికి శ్రమతో కూడుకున్న పనిగా మిగిలింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు కన్వేయర్‌ బెల్టును పునరుద్ధరించారు. అయితే ప్రమాదం జరగకముందు సొరంగంలో జరిగిన పనులకు సంబంధించిన మట్టి, రాళ్లు కన్వేయర్‌ బెల్టుపై ఉండటంతో, వాటిని మాత్రమే బయటికి తరలించారు.

● భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ ప్రతినిధుల బృందం ఢిల్లీ నుంచి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు చేరుకుంది. ఈ బృందం పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సొరంగం కుప్పకూలిన ప్రదేశంలో అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారులతో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

అచ్చంపేట రూరల్‌/ఉప్పునుంతల: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ప్రశ్నార్థకంగా మారింది. రోజూ విడతల వారీగా ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా.. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు సైతం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. షిఫ్ట్‌ల వారీగా సొరంగంలోకి వెళ్లి వచ్చిన వారు కూడా సమాచారం అందించడం లేదు. కాగా, సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీటి ఊట రోజురోజుకూ పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లోకో ట్రైన్‌లో సహాయ బృందాలు 13.5 కిలోమీటర్లు వెళ్లడానికి సుమారు 2 గంటల సమయం పడుతోందని.. అక్కడికి వెళ్లి గంట పాటు పనులు చేసి బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. టీబీఎం మెషీన్‌ విడి భాగాలను రైల్వే సిబ్బంది గ్యాస్‌ కట్టర్‌తో తొలగిస్తున్నారు.

ఫోరెన్సిక్‌ బృందం రాక..

సొరంగంలో సహాయక బృందాలకు దుర్వాసన వస్తుందని.. మట్టి తవ్వకాల్లో ఎముకలు బయటపడ్డాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రి నుంచి ప్రత్యేకంగా ఫోరెన్సిక్‌ బృందం సొరంగ ప్రాంతానికి చేరుకోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.

ఉన్నతాధికారుల సమీక్ష..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ కోరారు. టన్నెల్‌ ఇన్‌ లెట్‌ ఆఫీస్‌ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న బృందాల అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, మైనింగ్‌, ఫైర్‌ సర్వీసెస్‌, ర్యాట్‌ మైనింగ్‌ ప్రత్యేకతలు, ప్లాస్మా కట్టర్స్‌ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కన్వేయర్‌ బెల్టును పునరుద్ధరించిన కారణంగా గంటకు 800 టన్నుల మట్టిని బయటకు తీసుకురాగలమని అధికారులు వెల్లడించారు. గ్రౌండ్‌ పేనిట్రేటింగ్‌ రాడార్‌ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని.. కన్వేయర్‌ బెల్టు ద్వారా వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ చివరి భాగాలను గ్యాస్‌ కట్టర్‌ ద్వారా తొలగించి లోకో ట్రైన్‌ ద్వారా బయటకు తీసుకురానున్నట్లు చెప్పారు. సహాయక బృందాలకు అవసరమైన ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. కాగా, సహాయక చర్యలను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డీజీపీ నాగిరెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. సమావేశంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, కల్నల్‌ పరిక్షిత్‌ మెహ్ర, ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారి ప్రసన్న తదితరులు ఉన్నారు.

ఆచూకీ లభించేనా.? 1
1/1

ఆచూకీ లభించేనా.?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement