గద్వాలటౌన్: జిల్లా కేంద్రంతో పాటు అయిజ పట్టణంలో వివిధ శాఖల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణతోపాటు విద్యుత్, బీఎస్‌ఎన్‌ఎల్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌టీసీ శాఖల అధికారులకు సమస్యలపై బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షురాలు జయశ్రీ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు అయిజ, వివిధ గ్రామాల స్టేజీల దగ్గర బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలని, బాలభవన్ పూర్వ వైభవం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, నిరుపయోగంగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ స్తంభాలను తొలగించాలని, మెలచెర్వు క్రాస్ రోడ్డు నుంచి కొండపల్లి క్రాస్ రోడ్డు వరకు బీటీని పునరుద్దరించాలని కోరారు. అలాగే అయిజలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఉత్తనూర్ చౌరస్తా వరకు డబుల్ రోడ్డును నిర్మించాలన్నారు. పద్మావతి, కృష్ణవేణి, రవికుమార్, రామంజనేయులు పాల్గొన్నారు.