
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల రూరల్: ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 15వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు మొత్తం 9,228 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందుకోసం 13 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 13మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 13మంది ఫ్లయింగ్ స్వ్కాడ్ టీంలు, ఒక సిట్టింగ్ స్వ్కాడ్, ఏడు కస్టోడియన్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని, కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, మూత్రశాలలు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
ఎస్సెస్సీ పరీక్షలకు 40సెంటర్లు..
అదేవిధంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 7,370 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, ఇందుకోసం 40సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 2ప్‌లైయింగ్, 40సిట్టింగ్, 12 కస్టోడియన్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగుతుందని, కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ రాములు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి హృదయరాజు, డీఈఓ సిరాజుద్దీన్, ఆర్టీఓ పురుషోత్తంరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శశికళ తదితరులు పాల్గొన్నారు.
