భూపాలపల్లి అర్బన్: ప్రజాపాలనతోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వారితో కలిసి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్నారు. తుర్రేబాజ్ ఖాన్, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు తదితరుల పోరాటాలు ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లాలో 29,683 మంది రైతులకు రూ.299.35 కోట్ల రుణమాఫీ, 1,27,151 మంది రైతులకు రైతుభరోసా కింద రూ.145 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు తెలిపారు. 21,806 మంది రైతుల నుంచి 12.58 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.298.21 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. మహిళా సాధికారతకు ఇందిరా మహిళాశక్తి, మహాలక్ష్మి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 68,373 మంది లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం వర్తింపజేసి రూ.6.55 కోట్ల సబ్సిడీ విడుదల చేశామన్నారు. భూభారతి చట్టంతో ధరణి లోపాల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో 1,39,682 స్మార్ట్ రేషన్ కార్డులు, 17,301 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపారు. గృహజ్యోతి కింద 28,298 కుటుంబాలకు జీరో విద్యుత్ బిల్లులు జారీచేస్తూ రూ.50.86 కోట్ల సబ్సిడీ అందిస్తున్నామన్నారు. మొదటి విడతలో మంజూరైన 4,586 ఇందిరమ్మ ఇళ్లలో 1,098 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి
ప్రభుత్వం పెద్దపీట
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
ఘనంగా ప్రజాపాలన దినోత్సవ
కార్యక్రమం


