కాళేశ్వరం : చిన్నారులకు ప్రాథమిక విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించే అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. స్వచ్ఛ భారత్ నినాదాలు హోరెత్తుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. జిల్లాలోని అనేక అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో మూత్ర, మల విసర్జనకు పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశాలకు వెళ్తున్నారు. లేదంటే చుట్టుపక్కల వారి ఇళ్లలోకో వెళ్లాల్సి వస్తోంది. మరుగుదొడ్లకు నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణాలు కావడం లేదు.
రూ.36వేలు నిధులు
మంజూరు..
జిల్లాలోని కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు మరుగుదొడ్డి నిర్మాణానికి ఇప్పటికే రూ.36వేలు నిధులు మంజూరు చేశారు. సంబంధిత కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు నిర్మాణాలు చేపట్టడం లేదు. దీంతో చిన్నారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణాలు చేయడంపై అధికారులు దృష్టి సారించడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి మరుగుదొడ్లు లేని కేంద్రాలను గుర్తించి వెంటనే నిర్మాణాలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో
మరుగుదొడ్లు లేక ఇబ్బందులు
పిల్లలు, గర్భిణులు, బాలింతలు,
సిబ్బందికి తప్పని తిప్పలు
నిధులు మంజూరైనా..
నిర్మాణాలు చేయట్లే..
పట్టించుకోని అధికారులు
జిల్లాలో ఇలా..
అంగన్‌వాడీ కేంద్రాలు : 644
టీచర్లు : 604
ఆయాలు : 524
పిల్లల సంఖ్య : 22,079
బాలింతలు : 2,228
గర్భిణులు : 2,109
అద్దె భవనాలు : 244
సొంత భవనాలు : 186
ప్రభుత్వ భవనాల్లో : 214
నడిచేవి


