బాల్యవివాహాలను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలను అరికట్టాలి

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

మల్హర్‌: బాల్య వివాహాల అరికట్టాలని సఖీ కేంద్రం కేస్‌ వర్కర్‌ సరిత, జిల్లా మహిళా సాధికారత కేంద్రం మిషన్‌ కోఆర్డినేటర్‌ కృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు బాలికల జీవితాలను అర్ధాంతరంగా నిలిపివేసే సామాజిక సమస్య అని పేర్కొన్నారు. చిన్న వయస్సులో వివాహం జరగడం వల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోవడంతో పాటు, ఆరోగ్యపరమైన సమస్యలు, మానసిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు వంటి అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. ‘బాల్య వివాహం–బతుకు ఆగం’ అనే పోస్టర్లు ఆవిష్కరించి ఆ నినాదాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. 1098 (చైల్డ్‌ హెల్ప్‌లైన్‌), 181 (మహిళా హెల్ప్‌లైన్‌), 14567 వంటి అత్యవసర సేవా నంబర్ల గురించి వివరించారు. అనంతరం బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు జయప్రద, అరుణ,లక్ష్మీ, బాలమ్మ, బాలికలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మహాముత్తారం: ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహిళవారోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ నిహరిక ఆధ్వర్యంలో బాల్యవివాహం బతుకు ఆగం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహల వల్ల బాలికల విద్యా,ఆరోగ్యం భవిష్యత్‌పై కలిగే ప్రతికూల ప్రభావల గురించి సర్పంచ్‌ కొండగోర్ల బాపు వివరించారు. నాగరాణి, సఖీసెంటర్‌ అడ్మిన్‌ గాయిత్రి, ఏఏఐ కుమారస్వామి, డీహెచ్‌ఈబ్ల్యూ అకౌంటెంట్‌ సురేష్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

టేకుమట్ల: బాల్య వివాహాల నిర్మూలకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్సై అమూల్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి ఆధ్వర్యంలో బాల్య వివాహం–బతుకు ఆగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల భవిష్యత్‌లో శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. చైల్డ్‌ లైన్‌ ప్రతినిధి కళావతి, సర్పంచ్‌ మాట్ల శ్రీనివాస్‌, సూపర్‌వైజర్‌ సరోజన, డీసీపీయూ సోషల్‌ వర్కర్‌ కుమార్‌ పాల్గొన్నారు.

మొగుళ్లపల్లి: మండలంలోని పిడిసిల్ల గ్రామంలో బాల్య వివాహం–బతుకు ఆగం అనే కార్యక్రమంపై ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ మాధవి ఆధ్వర్యంలో సర్పంచ్‌ నైనాకంటి మమత సమక్షంలో కిశోర బాలికలకు, మహిళలకు గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహల నిర్మూళనకు సంబంధిచిన పోస్టర్‌ ఆవిష్కరించారు. అంగన్‌వాడీ టీచర్‌ శ్యామల చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ అధికారి చరణ్‌, సఖి కౌన్సిలర్‌ మాధవి, మమతతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement