కాళేశ్వరం: కాళేశ్వరంలో జరిగే అంత్య పుష్కరాలకు వచ్చిన వివిధ శాఖలకు చెందిన కొంత మంది ఉద్యోగులు ఈఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మిడియా పాయింట్‌లోనే తిష్టవేసి సాయంత్రం వ రకు సేదదీరుతున్నారు. మీడియాపాయింట్‌లో రెండు ఏసీలు విశాలమైనగది ఉండడంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఉద్యోగులు తిష్ట వేసి వారి విధులు మరిచిపోయి అక్కడే సాయంత్రం వరకు ఉండడం గమనార్హం. వారిపైన ఉన్నతాధికారులు దృష్టిసారించాలని పలువురు జర్నలిస్టులు కోరుతున్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని సరస్వతీఘాటులో తెప్పోత్సవానికి విద్యుత్ వైరు సరిచేస్తుండగా అక్కడే పని చేస్తున్న బాపు అనే కూలీకి విద్యుత్‌షాక్ తగలడంతో మంగళవారం కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన మరో కూలీ కర్రతో కొట్టడంతో ప్రమాదం తప్పింది. కొంత సేపు తరువాత బాపు స్పృహా నుంచి తేరుకున్నాడు. క్షేమంగా బయటపడడంతో ఊపిరిపీల్చుకున్నారు.
పింఛన్ కోసం
దరఖాస్తు చేసుకోవాలి
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్లు మంజూరు చేస్తున్న క్రమంలో మహదేవపూర్ మండలంలోని అర్హులైన దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు అందరూ దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్) మండల అధ్యక్షుడు వీరగంటి సమ్మయ్య సూచించారు. గత 13 సంవత్సరాల నుంచి పింఛన్ రాక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు మనోవేదనకు గురయ్యారని, ప్రభుత్వం ఇటీవల నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోమని ప్రకటించడంతో వీరికి భరోసా, మనోధైర్యాన్ని కల్పించినట్లు అయిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
బెల్లి లలితకు నివాళి
మల్హర్: మండలంలోని కొయ్యూరులో సోమవారం బెల్లి లలిత వర్ధంతిని ప్రజా సంఘాల జిల్లా చైర్మన్ పీక కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాట మాటతో సబ్బండ వర్గాలను, కులాలను, చైతన్యం చేస్తూ తెలంగాణ పల్లెల్లో ఉద్యమ జ్వాలను రగిలించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేవి భూమయ్య, సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనగామ జనార్ధన్. కుల ప్రజా సంఘాల జిల్లా కో కన్వీనర్ అయితే బాపు, మండల కో కన్వీనర్ గడ్డం లచ్చన్న, బోయిని రాజన్న, యాదండ్ల గట్టయ్య, వేల్పుల నారాయణ, యాట్ల శంకర్, సదానందం, తదితరులు పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
రేగొండ: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ యజమాని జైపాల్‌రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


