కాంగ్రెస్‌ ఎస్సీ విభాగానికి కొత్త సారథులు.. | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎస్సీ విభాగానికి కొత్త సారథులు..

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగాన్ని మరింత చురుకుగా మార్చేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాల పరిధిలోని ఐదు జిల్లాలకు కొత్త చైర్మన్లను నియమిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఐదు జిల్లాల చైర్మన్‌లు వీరే..

కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం హనుమకొండ జిల్లా చైర్మన్‌గా ఆరూరి సాంబయ్య, వరంగల్‌ జిల్లాకు చిలువేరు శ్రీనివాస్‌, జనగామకు చేపూరి వినోద్‌, మహబూబాబాద్‌కు తిప్పర్తి శ్రీధర్‌, ములుగు జిల్లాకు మట్టెవాడ తిరుపతిలను నియమించారు. జాబితాలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు నియమించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా కాంగ్రెస్‌ ఎస్సీ విభాగంలో చేపట్టిన ఈ మార్పులు రాబోయే రోజుల్లో పార్టీ క్షేత్రస్థాయి రాజకీయాలకు ఎంతవరకు బలం చేకూరుస్తాయో?నన్న చర్చ మొదలైంది.

పత్తి మిల్లు తనిఖీ

మల్హర్‌(కాటారం): కాటారంలోని మీనాక్షి పత్తి మిల్లు, రుద్రార జిన్నింగ్‌ మిల్లును కాటారం ఆర్డీఓ రవీందర్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మిల్లులోని రికార్డులను పరిశీలించి, స్టాక్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగరాజు, ఏఎంసీ చైర్‌పర్సన్‌ పంతకాని తిరుమల, పీఏసీఎస్‌ సీఈఓ ఎడ్ల సతీష్‌ పాల్గొన్నారు.

భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

భూపాలపల్లి రూరల్‌: దళిత ఉద్యమ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ 22 జయంతి వేడుకలు శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని కొనియాడారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు నేటితరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఎస్సీ కులాల అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఇందిర, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, ఆర్‌టీఏ మెంబర్‌ సుంకరి రామచంద్రయ్య, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విజయేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు

గణపురం: గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్‌ విద్యుత్‌కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని కంచి కామకోటి 70వ పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం సందర్శించారు. కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలను ప్రారంభించిన అనంతరం ఆయన తిరుగు ప్రయాణంలో కేటీపీపీకి వచ్చారు. కేటీపీపీ సీఈ, ఆలయ చైర్మన్‌ శ్రీ ప్రకాశ్‌ దంపతుల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేశారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న జగద్గురులకు సీఈ దంపతులు, ఆలయ అర్చకులు, ప్రాజెక్టు అధికారులు పూర్ణకుంభంతో మంగళవాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి వారికి కంచి పీఠాధిపతి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. దేవతామూర్తులను దర్శించుకొని పూజలు నిర్వహించారు. జగద్గురు ఆలయానికి వచ్చారన్న విషయం తెలుసుకున్న ఉద్యోగుల కుటుంబాలు పెద్దఎత్తున స్వామి వారి దర్శనానికి తరలి వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement