ములుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో ప్రతీ ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, సంక్షేమ పథకాలకు అర్హుల జాబితా వెంటనే సిద్ధం చేయాలని, జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి సమావేశాన్ని లీలా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన నిర్వహించగా సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్‌పాస్ట్ పథకం అమలు చేయబోతున్నమన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి భద్రత కల్పిస్తామని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం విస్తరిస్తామని, దివ్యాంగ ఇంటర్ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు అందిస్తామన్నారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఆలయ అభివృద్ధికి 22 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించి నష్టపరిహారం చెల్లించామన్నారు.
జిల్లాకు అత్యధిక ఇందిరమ్మ ఇళ్లు..
రాష్ట్రంలోనే ములుగు నియోజకవర్గానికి అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని, జిల్లాలో నూతనంగా 38 వేల పైచిలుకు పెన్షన్లను జూన్ 2న అందించనున్నట్లు తెలిపారు. అనంతరం సీ్త్ర నిధి ద్వారా 112 మహిళా సంఘాలకు రూ.2.25 కోట్లు, బ్యాంకు లింకేజీ ద్వారా 175 మహిళా సంఘాలకు రూ.16.15 కోట్లు, ములుగు మున్సిపాలిటీ మెప్మా ద్వారా 25 సంఘాలకు రూ.2.2 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 140 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, డీఆర్‌డీఏ, రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీతక్క పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వత్సల్ టొప్పో, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్ ఆసియా షాహిన్, పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూన్ 2 నుంచి రెండో విడత
ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు
పంచాయతీరాజ్ శాఖ
మంత్రి ధనసరి సీతక్క


