రేగొండ: పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో మంటలు చెలరేగి సుమారు 50 ఎకరాల్లో మంటలు వ్యాపించిన ఘటన మండలంలోని రేపాకపల్లి శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత రైతుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ రైతు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టాడు. ఆ మంటలకు వడగాల్పులు తోడవడంతో సుమారు 50 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పలువురు రైతులకు చెందిన మోగార్ తీగలు, పైపులు, డ్రిప్ పైపులు కాలిపోయాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ.. రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వలన భూసారం తగ్గడంతో పాటు, ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రమాదానికి ఎవరైతే కారణమవుతారో వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కన్నీరే మిగిల్చిన పంటలు
టేకుమట్ల: ఆరుగాలం కష్టపడి పంట చేతికి వచ్చి విక్రయించే సమయానికి ప్రమాదవశాత్తు అగ్గిపాలైన ఘటన టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (టీ)లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. బాధిత రైతు దుద్దేటి కొమురయ్య కథనం ప్రకారం.. తనకున్న వ్యవసాయ భూమిలో ఎకరం మిర్చి పంటను సాగు చేయగా సుమారు 18 క్వింటాల మిర్చి కుప్ప పోసి విక్రయించేందుకు సిద్ధం చేశాడు. గురువారం అర్ధరాత్రి చేలరేగిన మంటలకు పంట కాలిపోయింది. అగ్నిప్రమాదంలో సుమారు మూడు లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. అలాగే మండలంలోని కుందనపల్లిలో పంట వ్యర్థాలను కాల్చేక్రమంలో ఇతర రైతుల పంట పొలాలకు వ్యాపించి పశుగ్రాసం, వ్యవసాయ మోగార్ పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి.


