భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ‘సేవ్ సింగరేణి’ బస్సు జాతా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ తెలిపారు. మంగళవారం ఏరియాలోని కేటీకే ఓసీ2 గనిలో సేవ్ సింగరేణి బస్సు జాతాకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ సింగరేణి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బస్సు జాతా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సేవ్ సింగరేణి పిలుపులో భాగంగా నేడు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో బైక్ ర్యాలీ, కార్నర్ సభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఇన్‌చార్జ్ రామ్‌చందర్, బ్రాంచ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


