తొలిరోజు మూడు నామినేషన్లు
మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రాజకీయ పార్టీల నేతలకు సవాల్‌గా మారింది. మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నెల రోజుల ముందు నుంచే ఆశావహులు తమ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒక్కో వార్డు నుంచి ముగ్గురు, నలుగురు టికెట్ ఆశిస్తున్నారు. వార్డుల్లో తమ సామాజిక వర్గం వారి ఓట్లే ఎక్కువగా ఉన్నాయని, తనకు టికెట్ ఇస్తే సరే, లేదంటే పార్టీని వీడి, స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని పలువురు ఆశావహులు తమ నేతలకు వెల్లడిస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగా.. రెబల్స్ ద్వారా పార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తోంది.
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొలిరోజు బుధవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. పట్టణంలోని 7వ వార్డుకు బీజేపీ మద్ధతుదారు ఒకరు, 9వ వార్డుకు బీఆర్‌ఎస్ మద్ధతుదారైన ఒకే వ్యక్తి రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే 28వ వార్డు నుంచి సీపీఐ మద్ధతుదారు ఒకరు నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు.
నేడు.. రేపు భారీగా నామినేషన్లు
మంగళవారం నోటిఫికేషన్ విడుదల కావడం, మరుసటి రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించడంతో కౌన్సిలర్‌గా పోటీ చేయనున్న అభ్యర్థులు పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. అంతేకాక ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐలు ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేదు. బుధవారం రాత్రి వరకు ప్రతీ పార్టీ ఒకటి, రెండు మినహా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. దీంతో నేడు(గురువారం), రేపు(శుక్రవారం) భారీ మొత్తంలోనే నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి.
రెండు పార్టీలతో కలిసి కాంగ్రెస్..
ఈ మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నాయి. మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా సీపీఐకి 4, సీపీఎంకు ఒక వార్డు స్థానాన్ని ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మిగిలిన 25 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పోటీలో నిలబడనున్నారు. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్, బీజేపీలు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి.
నేడు, రేపు భారీగా దాఖలయ్యే
అవకాశం
కాంగ్రెస్‌తో సీపీఐ, సీపీఎం పొత్తు
ఒంటరిగా బరిలోకి బీఆర్‌ఎస్, బీజేపీలు


