వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్య
గంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లకు చెందిన పగిడిద్ద రాజు పెళ్లి కొడుకయ్యాడు. సమ్మక్కను వివాహం చేసుకునేందుకు ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారానికి మంగళవారం బయలుదేరి వెళ్లాడు. ఈ మేరకు పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో వడ్డెలు గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి కల్తీ జగ్గారావు, పూజారులు పడిగను పట్టుకొని తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు ఆరబోశారు. వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్యా అంటూ భక్తులు మొక్కులు చెల్లించారు. 70 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో రాత్రి బసచేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారంలోని గద్దెకు చేరుకుంటారు. సమ్మక్కతో వివాహం అనంతరం జాతర తర్వాత పగిడిద్దరాజు తిరిగి పూనుగొండ్లకు చేరుకుంటారు. రెండురోజుల అనంతరం మరుబెల్లి జాతరను పూనుగొండ్లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని గిరిజనులు, గిరిజనేతరుల నమ్మకం. పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయం వద్ద గిరిజన యువకులు వలంటీర్లుగా పనిచేశారు. మంత్రి ధనసరి సీతక్క ,మేడారం ట్రస్ట్‌బోర్డు చైర్‌పర్సన్ సుకన్య, ములుగు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి, డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు వినయ్, సూర్యప్రకాశ్, ఎస్సై రవికుమార్, రాజ్‌కుమార్, ఎండోమెంట్ ఈఓ వీరస్వామి, రూరల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ నారాయణరెడ్డి పూజలు చేశారు.
పూనుగొండ్ల నుంచి మేడారానికి
సమ్మక్క భర్త పగిడిద్దరాజు
70 కిలోమీటర్లు అడవిలో కాలినడకన
పడిగతో బై లెల్లిన పూజారులు
వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్య


