బీఆర్‌ఎస్‌ది కమీషన్ల రాజకీయం
భూపాలపల్లి అర్బన్: కమీషన్ల కోసమే బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని.. కమీషన్లు రావని డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో రూ.2కోట్లతో బంజార భవనం, రూ.10కోట్లతో సీసీ రోడ్డు, డ్రెయినేజీల నిర్మాణ పనులకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, పేదవాడికి ఇళ్లు, మహిళలకు భరోసా వంటి ఎన్నో చార్రితక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతుంటే కొందరు రాజకీయంగా దివాళా తీసిన నేతలు అబద్దాలు, దుష్ప్రచారంతో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఒకసారి కాదు, రెండు సార్లు తగిన గుణపాఠం చెప్పారని మూడో సారి కూడా తిప్పి కొట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఇచ్చిన మాటలను చేతల్లో చూపే ప్రభుత్వమని అన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. జిల్లా రద్దు చేస్తారని వస్తున్న అసత్య వార్తలు ప్రజలు నమ్మొద్దని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీఓ హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కిష్టయ్య, శ్రీదేవి, వైస్ చైర్మన్ రాజేందర్ పాల్గొన్నారు.
హామీలను నెరవేరుస్తున్నాం..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి


