చిట్యాల నుంచి మేడారానికి 30 బస్సులు
చిట్యాల: ఈ నెల 27 నుంచి 31 వరకు చిట్యాల మండల కేంద్రం నుంచి మేడారం జాతరకు 30 బస్సులు కేటాయించినట్లు పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్ రాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్ గ్రౌండ్‌లో తాత్కాలిక షెల్టర్ నుంచి భక్తుల సౌకర్యార్ధం బస్సులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులలో వెళ్లడానికి టికెట్ ధర పెద్దలకు రూ.260, పిల్లలకు రూ.150 అన్నారు. ప్రత్యేక బస్సులలో మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని అన్నారు. చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల నుంచి జాతరకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం రాంప్రసాద్ కోరారు.
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సుభాష్ కాలనీ కాకతీయ స్టేడియంలో జరగనున్న గణతంత్ర వేడుకలను గురువారం సింగరేణి జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వేడుకల్లో ఉత్తమ ఉద్యోగుల సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏరియా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధికారులు రవికుమార్, రాజారావు, శ్యాంసుందర్, శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం: బడికి రాకుండా బయట ఉన్న 11 మంది విద్యార్థులను ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా కొయ్యూర్ ఎస్సై–2 రజన్‌కుమార్, కాటారం ఏఎస్సై సుధీర్‌కుమార్ ఆధ్వర్యంలో మహదేవపూర్ మండలం కాళేశ్వరం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో గురువారం చేర్పించారు. విద్య ప్రాముఖ్యతను వారి తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ద్వారా తెలిపారు. వారి వెంట ఐసీడిఎస్ సూపర్‌వైజర్ స్పందన, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
భూపాలపల్లి రూరల్: చేనేత కార్మికుల రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 56జీఓను విడుదల చేసినట్లు ఆ శాఖ జిల్లా అధికారి వెంకట్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2017 ఏప్రిల్ ఒకటి నుంచి 2024 మార్చి 31 వరకు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 140మంది కార్మికులకు చెందిన రూ.79లక్షలు మాఫీ కానున్నట్లు తెలిపారు.
టేకుమట్ల: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న బోధనా విధానాలు ఆదర్శంగా ఉండాలని జిల్లా పర్యవేక్షణ అధికారి వేణుగోపాల్ అన్నారు. గురువారం మండలంలోని వెలిశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న బోధనా విధానాలను పరిశీలించారు. పాఠశాలలో అభ్యసన ఫలితాలు, బేస్‌లైన్, మిడ్‌లైన్ పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రగతిని పర్యవేక్షణ బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ప్రతీ ఉపాధ్యాయుడు నాణ్యమైన, సమర్థవంతమైన బోధనా పద్ధతులను అనుసరిస్తూ విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపర్చాలని అన్నారు. పాఠశాల నిర్వహణలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు కొట్టె ప్రసాద్‌ను అభినందించారు. ఈ బృందంలో రమేశ్, రాధాకృష్ణ, రతన్‌సింగ్, సాంభమూర్తి, బాలశేరి రెడ్డి, రంగరాజు, ఉపాధ్యాయులు ఉన్నారు.
చిట్యాల నుంచి మేడారానికి 30 బస్సులు
చిట్యాల నుంచి మేడారానికి 30 బస్సులు


