
బంద్ సక్సెస్
వాటాకోసం నినదించిన బీసీలు
భూపాలపల్లి అర్బన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. బంద్‌కు అన్ని బీసీ కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ఎస్సీ సామాజిక వర్గాల నాయకులు మద్దతు తెలిపి బంద్‌లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్దకు బీసీ జేఏసీ నాయకులు చేరుకొని ఆర్టీసీ బస్సులు బయటకి రాకుండా అడ్డుకున్నారు. వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరువ్యాపారులు కూడా బంద్‌లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పైడిపల్లి రమేష్, రమేష్, అజయ్, రామగిరి సదానందం, అశోక్, రాజేందర్, రవీందర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల ర్యాలీ
జిల్లాకేంద్రంలోని హన్‌మాన్ దేవాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కళ్లకు గంతలు కట్టుకొని..
మోకాళ్లపై నిల్చుని నిరసన..
సీపీఐ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ సెంటర్‌లో పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. బీసీ జర్నలిస్టు సంఘాల నాయకులు అంబేడ్కర్ సెంటర్‌లో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పట్టణంలో బైక్‌ర్యాలీ చేపట్టి అంబేడ్కర్‌సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.
ఎమ్మార్పీఎస్ మద్దతు..
బంద్‌కు జిల్లాకేంద్రంలో ఎమార్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. నల్ల కండువాలు ధరించి పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు.
స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు
రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు
మద్దతు తెలిసిన రాజకీయ పార్టీలు, సంఘాలు
జిల్లాకేంద్రంలో జేఏసీ నాయకుల ర్యాలీ

బంద్ సక్సెస్