
‘సాక్షి’పై వేధింపులు సరికాదు
● జిల్లాకేంద్రంలో జర్నలిస్టుల నిరసన ర్యాలీ
● పార్టీలు, ప్రజా, కుల, విద్యార్థి సంఘాల మద్దతు
భూపాలపల్లి అర్బన్: ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వం సాక్షి దినపత్రికపై వేధింపులు, ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులు పెడుతూ పత్రికా స్వేచ్ఛను హరించడం మానుకోవాలని జిల్లాకేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టు సభ్యులు డిమాండ్ చేశారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై పెడుతున్న అక్రమ కేసులను నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలను ఎత్తిచూపుతున్న సాక్షి దినపత్రికపై ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అన్యాయాలు, కుట్రలను అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఎడిటర్ ధనంజయరెడ్డి మీద వరుసగా కేసులు పెట్టడంతో పాటు విచారణల పేరిట వేధింపులకు గురిచేయడం సరైంది కాదన్నారు. అక్రమ కేసులు బనాయించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులు, భయబ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్య అన్నారు. ధర్నాకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు క్యాతరాజు సతీష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల జోసెఫ్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పోతరాజు రవిభాస్కర్, సామంతుల శ్యామ్, ఎడ్ల సంతోషం, సామల శ్రీనివాస్, క్యాతం సతీష్, జల్ది రమేష్, ఎర్రం సతీష్, రాజు, మంతెన సమ్మయ్య, నరసయ్య, మోహన్, సారేశ్వర్, సుధాకర్, లక్ష్మారెడ్డి, ప్రవీణ్, సత్యనారాయణ, శ్రీనివాస్, మధు, శేఖర్, రవి, మహేందర్, జగన్, మున్నా పాల్గొన్నారు.