
తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామ రక్ష
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి: తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామ రక్ష అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాస ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ... పోషణ మాసంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 4వ స్థానం లభించడం అభినందనీయమని అన్నారు. చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యత అంగన్‌వాడీ సిబ్బందిపై ఉందని చెప్పారు. ఇళ్లలో సహజసిద్ధంగా లభించే మునగ, కరివేపాకు వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలని, ఇవి శరీరానికి పుష్టి, శక్తిని అందిస్తాయని చెప్పారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
టీకాలు వేయించాలి..
పశువులకు టీకాలు తప్పకుండా వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. జిల్లా పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా శిబిరాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పశువుల ఆరోగ్యం రైతు కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి ముడిపడి ఉందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆవులు, గేదెలు, దూడలు, ఎడ్లకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా పశు వైద్యాధికారి కుమారస్వామి పాల్గొన్నారు.