
బార్డర్‌లో వాహన తనిఖీలు
కాళేశ్వరం: కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన సమీపంలోని బార్డర్ చెక్‌పోస్టు వద్ద కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. మూడు రోజుల కిందట మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద మావోయిస్టుపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీ కీలక నేత ఆశన్నతో రెండువందల మంది వరకు ప్రభుత్వం వద్ద లొంగిపోయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ మిగిలిన కొంతమంది తలదాచుకునేందుకు ఇటువైపుగా తరలివస్తారనే అనుమానంతో పోలీసులు నజర్ వేశారు. అనుమానితులు, సానుభూతిపరులు భూపాలపట్నం, గడ్చిరోలి జిల్లాల నుంచి తెలంగాణ వైపునకు వచ్చే అవకాశం ఉన్నందున వాహన తనిఖీలు, సోదాలు చేసినట్లు తెలిసింది. వాహనాల పత్రాలు, లైసెన్స్, చలాన్‌లు పరిశీలించారు. నంబర్‌ప్లేటు లేని వాహనాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఆయన వెంట సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.