
బోధనేతర భారం
పాఠశాలల తనిఖీలకు ఉపాధ్యాయ కమిటీలపై వ్యతిరేకత
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీకి ఉపాధ్యాయుల కమిటీల ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వగా ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బందులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తనిఖీలకు ఉపాధ్యాయులతో కమిటీలు వేయడం ద్వారా ప్రతిభకలిగిన వా రు కమిటీలకు వెళితే అక్కడ పాఠాలు ఎవరు చెబు తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తని ఖీ బాధ్యతలు తీసుకున్న టీచర్లకు ఇక బడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంతో సర్కారు బడుల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు..
పదేళ్ల సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయులతో కమిటీలు వేయాలని విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి తనిఖీ కమిటీలు వేయనున్నారు. ప్రతీ వంద ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒక్కటి చొప్పున ప్రతీ 50 ఉన్నత పాఠశాలలకు ఒక కమిటీని నియమించనున్నారు. ఈ లెక్కన జిల్లాలో 394 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 324, ఉన్నత పాఠశాలలు 70 ఉన్నాయి. ప్రాథమిక, ప్రాధమికోన్నత పాఠశాలలకు 4 కమిటీలు, ఉన్నత పాఠశాలలకు 2 కమిటీలు జిల్లాలో వేసే అవకాశం ఉంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత కమిటీలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు స్కూల్ అసిస్టెంట్, ఇద్దరు టీచర్లు ఉండనున్నారు. హైస్కూల్ కమిటీల్లో నోడల్ అధికారితోపాటు 8 మంది సభ్యులు ఉండనున్నారు.
బోధనకు దూరం
కమిటీల్లో నియమితులయ్యే ఉపాధ్యాయులు బోధనకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయులు బోధనకు దూరమైతే పాఠశాలల పరిస్థితి ఏమిటనేది తేలాల్సి ఉంది. ఉపాధ్యాయులపైనే ఉపాధ్యాయులు తనిఖీల కమిటీలతో పెత్తనంపై ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ కమిటీల వల్ల ఉపాధ్యాయుల్లో విభేదాలు పెరిగి లాభం కంటే నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తనిఖీ కమిటీల వల్ల సిలబస్ పూర్తయ్యే అవకాశం లేకుండాపోతుంది. జిల్లాలో వందకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట నుంచి ఎక్కువగా ఉన్నచోటకి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి విద్యాబోధన నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తనిఖీ కమిటీల్లో ఉపాధ్యాయులను నియమించడం కోసం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉత్తర్వులపై ఉపాధ్యాయ
సంఘాల పెదవి విరుపు
కలెక్టర్ ఆధ్వర్యంలో
జిల్లాస్థాయి తనిఖీ కమిటీలు
50 ఉన్నత పాఠశాలకు ఒక కమిటీ..
100 పీఎస్, యూపీఎస్‌లకు తనిఖీకి మరో బృందం
ఉన్నత పాఠశాలల్లో సిలబస్‌పై ప్రభావం